ఉదయం పూజలు...రాత్రిళ్లు చోరీలు | Cyberabad Police Arrested Three Temple Thieves | Sakshi
Sakshi News home page

ఉదయం పూజలు...రాత్రిళ్లు చోరీలు

Feb 15 2019 10:11 AM | Updated on Feb 15 2019 10:12 AM

అరెస్టయిన దొంగలు  హరీష్‌ బాబు, నాగేంద్రబాబు, విశాల్‌ (వరుసగా ఎడమ నుంచి కుడివైపు) - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ‘ఉదయం భక్తుడిగా దేవాలయంలో జరిగే పూజలకు వస్తాడు. అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహలతో పాటు ఇతర వస్తువులను పరిశీలిస్తాడు. ప్రవేశం దగ్గరి నుంచి నిష్క్రమణ వరకు ఏయే మార్గాలున్నాయో గుర్తు పెట్టుకుంటాడు. ఈ విషయాలను స్నేహితులకు వివరించి రాత్రి సమయాల్లో దేవుళ్లకే శఠగోపం పెడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను సైబరాబాద్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి 9.5 కిలోల వెండి ఆభరణాలు, బైక్, మూడు ఎల్‌ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిల, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావుతో కలిసి సీపీ వీసీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు.  

వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌
 

ఇళ్లల్లో చోరీల నుంచి దేవాలయాలవైపు 
మేడ్చల్‌ జిల్లా, శామీర్‌పేటకు చెందిన నాగేంద్రబాబు, పల్లె హరీష్‌ బాబు సులభంగా డబ్బులు సంపాదించేందుకు మూడేళ్ల క్రితం చోరీలబాట పట్టారు. తొలినాళ్లలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న వీరు 2017 శామీర్‌పేట పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చారు. గతేడాది అక్టోబర్‌ నుంచి శామీర్‌పేటకు చెందిన విశాల్‌ చంద్ర సహకారంతో దేవాలయాల్లో చోరీలకు తెరలేపారు. విశాల్‌ చంద్ర ఉదయం వేళల్లో ఆలయాలకు వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఆయా ఆలయాల్లో ఉన్న విగ్రహాలు, వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించి తన స్నేహితులు నాగేంద్రబాబు, పల్లెహరీష్‌ బాబుకు సమాచారం అందించేవాడు. వారు ఇద్దరు అర్ధరాత్రి  గుడి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడేవారు. హుండీల్లో దొరికిన డబ్బులను పంచుకొని, బంగారు అభరణాలు, వెండి విగ్రహాలను పల్లె హరీష్‌ బాబు ఇంటికి తరలించేవారు. అనంతరం వాటిని అమ్మి డబ్బులను మిగిలిన ఇద్దరికి పంచేవాడు. ఈ తరహాలో వీరు సిద్ధిపేట, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 23 దేవాలయాల్లో చోరీలు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బాలానగర్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో బృందం వేలిముద్రలను పరిశీలించింది. పాతనేరస్తుల వేలిముద్రలకు సరిపోవడంతో నాగేంద్రబాబు, హరీష్‌బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా విశాల్‌ చంద్ర విశాల్‌ చంద్ర విషయం వెల్లడించారు. దీంతో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 13 చోరీలు చేధించినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement