దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి..

Constable Wife Died in Lorry Accident - Sakshi

 రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ భార్య మృతి

ఆనందపురం మండలం శిర్లపాలెం వద్ద ఘటన

ఆనందపురం(భీమిలి): ఆనందపురం మండలం శిర్లపాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం బొండపల్లి గ్రామానికి చెందిన కోన శ్రీనివాసరావు ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కుటుంబంతో విజయనగరం కంటోన్మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. సింహాచలంలోని బైరవకోనలో దైవ దర్శనానికి శ్రీనివాసరావుతో పాటు అతని భార్య రేణుకాదేవి, వదిన రమణ, తోడల్లుడు చిన రాంబాబు రెండు బైకులపై సోమవారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్లారు. అక్కడ దైవ దర్శనం అనంతరం వారు తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా శిర్లపాలెం గ్రామం వద్దకు చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న కారు ముందు ఉన్న బస్సును ఓవర్‌ టేక్‌ చేసి శ్రీనివాసరావు నడుపుతున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మోటారు బైక్‌ వెనుక వైపు కూర్చున్న రేణుకాదేవి(37) కిందపడి పోగా వెనక వైపు నుంచి వస్తున్న లారీ ఆమెపై నుంచి వెళ్లి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ, కారు డ్రైవర్లను ఎస్‌ఐ శ్రీనివాస్‌ అరెస్ట్‌ చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

రెండు రోజుల వ్యవధిలో ఇద్దరి మృతి
బాకురుపాలెం నుంచి శిర్లపాలెం మధ్య రెండు రోజుల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఆనందపురం–పెందుర్తి రహదారి నుంచి విజయనగరం వెళ్లే ఈ మార్గంలో ఇటీవల వాహన రాకపోకలు ఎక్కువయ్యాయి. అలాగే బాకురుపాలెం, ముకుందపురం, శిర్లపాలెం, ముచ్చర్ల గ్రామాల వద్ద ప్రమాదకర మలుపులు ఉన్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఈ రూట్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top