యువకుడి దారుణ హత్య

Conflicts Between Friends And Murdered For Women in Guntur - Sakshi

పిడుగురాళ్లలో వెలుగుచూసిన ఘోరం

స్నేహితులే హత్య చేసుంటారని ఆరోపణలు

మహిళ విషయమై గొడవపడిన స్నేహితులు

గుంటూరులో యువకుడిని కొట్టిచంపిన     స్నేహితుని బంధువులు

నిందితుల్లో ఆర్‌ఎస్‌ఐ, ఓ పత్రిక విలేకరి

యువతి విషయమై జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన పిడుగురాళ్లలో సోమవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. పట్టణానికి చెందిన మోరె గోపి(22)ని పదునైన ఆయుధాలతో హత్య చేసిన నిందితులు, మృతదేహాన్ని పట్టణంలోని రైల్వేట్రాక్‌పై పడేశారు. గుంటూరు పట్టణంలో వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఇక్కుర్తి శ్రీహరి (26)ని అతని స్నేహితుడి బంధువులు నిర్బంధించి తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు.

గుంటూరు , పిడుగురాళ్ల: యువకుడి దారుణ హత్య పిడుగురాళ్లలో సోమవారం సంచలనం సృష్టించింది. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ప్రజాశక్తి నగర్‌లోని మోరె గోపి(22) డ్రైవర్‌గా పనిచేస్తుం టాడు. ఆదివారం రాత్రి గోపి తన స్నేహితులతో కలసి మద్యం తాగి, ఓ మహిళ విషయమై గొడవ పడినట్లు స్థానికులు తెలిపారు. ఆ తర్వాత అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే గోపి కూడా తన ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఊరికి వెళతానంటూ గోపి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. అయితే గోపి ద్విచక్రవాహనం అతని సోదరుడి వద్ద ఉంది. మద్యం తాగి ఉన్న గోపికి వాహనం ఇస్తే ప్రమాదమనే ఉద్దేశంతో సోదరుడు వాహనం ఇవ్వలేదు. చివరకు గోపి తన స్నేహితుడు శ్యామ్‌ ద్విచక్రవాహనాన్ని తీసుకుని ఊరికి వెళతానని ఇంట్లో చెప్పి బయలుదేరి వెళ్లాడు. అయితే తెల్లవారేసరికి రైల్వేబ్రిడ్జి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై గోపి శవమై కనిపించాడు.  ఈ సమాచారం తెలుసుకున్న గోపి తల్లిదండ్రులు రమణమ్మ, వెంకటేశ్వర్లు కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. రోడ్డుపై ఉన్న ద్విచక్రవాహనంపై రక్తపు మరకలు ఉండటంతో పాటు వాహనం ముందు భాగం ధ్వంసమైంది.

అక్కడి నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న రైల్వేట్రాక్‌ మధ్యలో గోపి మృతదేహం పడి ఉంది. కాళ్లకు దెబ్బలతో పాటు తల రెండు భాగాలుగా చీలిపోయింది. ఏదో బలమైన ఆయుధంతో బలంగా కొట్టడం వల్ల తల చీలిపోయిందని, ఇది ప్రమాదం కాదని బంధువులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. ఓవర్‌ బ్రిడ్జి కింద హత్య చేసి తర్వాత ప్రమాదంగా సృష్టించేందుకు రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పట్టణ సీఐ వీరేంద్రబాబు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గుంటూరు నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. డాగ్‌ స్క్వాడ్‌ ట్రాక్‌ వద్ద నుంచి పట్టణంలోని సుగాలితండా వద్దకు వచ్చి నిలిచిపోయాయి. దీంతో డాగ్‌స్క్వాడ్‌ అందించిన క్లూస్‌తో కేసు పురోగతి సాధించిందని, ఇది హత్యేనని సీఐ తెలిపారు. హత్యకు సంబంధించిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ వీరేంద్రబాబు తెలిపారు. మృతుడి తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top