నటి భానుప్రియపై చెన్నైలో కేసు

Child Labour Case File on Actress Bhanu Priya in Tamil nadu - Sakshi

అరెస్ట్‌ తప్పదా?

తమిళనాడు,పెరంబూరు: నటి భానుప్రియపై బాల కార్మికుల నేరం కేసు మరోసారి కలకలం సృష్టిస్తోంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, సామర్లకోట పోలీసులు భానుప్రియపై నమోదు చేసిన కేసు ఇప్పుడు చెన్నై పోలీసుల చేతికి మారింది. చెన్నైలో ఒక ఫ్లాట్‌లో నివశిస్తున్న భానుప్రియ తన ఇంటి పని కోసం మైనర్‌ బాలికలను నియమించుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తన ఇంట్లో పనిపిల్ల చోరీకి పాల్పడిందంటూ గత జనవరి 19న స్థానిక పాండిబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్‌ ఫిర్యాదు చేశారు. ఇంటి పనిపిల్లే చోరీకి పాల్పడి ఉంటుందని, ఆ అమ్మాయిపై కేసు నమోదు చేయాలని భానుప్రియ పేర్కొంది. అయితే పనిపిల్ల తల్లి ప్రభావతి సామర్లకోట పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపీకృష్ణన్లపై ఫిర్యాదు చేసింది.

అందులో తన కూతుర్ని  ఇంట్లో నిర్బంధించి చిత్రవధకు గురి చేస్తున్నారని, తన కూతురిని రక్షించమని కోరింది. దీంతో సామర్లకోట పోలీసులు చెన్నైకి వచ్చి నటి భానుప్రియను విచారించారు. అదే సమయంలో భానుప్రియ పెట్టిన కేసులో చెన్నై, పాండిబజార్‌ పోలీసులు పనిపిల్ల, తల్లి ప్రభావతిని అరెస్ట్‌ చేసి విచారించారు. అలాంటిది తాజాగా సామర్లకోట పోలీసులు నటి భానుప్రియ కేసును మరోసారి వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన నేరం జరిగింది చెన్నైలో కాబట్టి నటి భానుప్రియపై బాల కార్మికుల చట్టం కింద వారు నమోదు చేసిన కేసును చెన్నై పోలీసులకు ఇటీవల తరలించారు. దీంతో చెన్నై, పాండిబజార్‌ పోలీసులు ఆ కేసుకు సంబంధించి నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్‌పై కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు నటి పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top