శిశువు మృతికి మీరే కారణం!

Child Death In Private Hospital in Prakasam District - Sakshi

 ప్రైవేటు ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన

వైద్యుని నిర్లక్ష్యంపై నిరసన

కనిగిరి:  వైద్యుని నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందాడంటూ తల్లి దండ్రులు, బంధువులు ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఆందోళన చేసిన ఘటన బుధవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం పీసీపల్లి మండలం మురిగమ్మికి చెందిన నాగమణి రెండో కాన్పుకు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిచేరి మగ శిశువుకు మంగళవారం జన్మనిచ్చింది. అయితే శిశువు అనారోగ్యంగా ఉండటంతో పట్టణంలోని శ్రీనివాస« థియేటర్‌ వద్ద గల ఓ చిన్న పిల్లల ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. చిన్నపిల్లల వైద్యుడు చికిత్స నిర్వహించి ఆరోగ్యం బాగానే ఉందని రాత్రి 8 గంటలకు శిశువుకు పాలు పట్టించేందుకు తల్లి వద్దకు పంపాడు. అయితే బుధవారం తెల్లవారు జామున 3గంటల నుంచి శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో తండ్రి నాగరాజు తిరిగి చిన్న పిల్లల వైద్యశాలకు వచ్చాడు. డాక్టర్‌ లేడని ఉదయం 7 గంటలకు రమ్మని తెలిపాడు.
ఈ క్రమంలో 7 గంటలకు శిశువును చిన్న పిల్లల వైద్యశాలకు తీసుకొచ్చి డాక్టర్‌ వద్ద చూపించారు.

డాక్టర్‌ వైద్య, రక్త  పరీక్షలు చేయించి తల్లీ బిడ్డలు వైద్యశాలలో మూడు రోజులు జాయిన్‌ అవ్వాలని చెప్పారు. దీంతో ఉదయం 10 గంటలకు ఆస్పత్రిలో చేరారు. వచ్చిన వెంటనే పరీక్షించి డ్రాప్స్‌ ఇచ్చిన కాంపౌండర్‌ ఆతర్వాత పట్టించుకోలేదు. మధ్యాహ్నం తర్వాత బిడ్డలో కదలిక లేక పోవడంతో తల్లి దండ్రులు ఆందోళనకు గురై..  కాంపౌండర్‌పై కేకలు వేయడంతో బాబును పరీక్షించి, ఐసీయూలోకి తీసుకెళ్లి కొద్దిసేపటికే బాబు చనిపోయినట్లు చెప్పాడని తల్లిదండ్రులు జి. నాగమణి, నాగరాజులు విలేకర్లకు తెలిపారు. బరువు తక్కువగా ఉన్న తన బిడ్డకు సకాలంలో వైద్యం అందించకుండా.. కనీసం పట్టించుకోకపోవడంతోనే చనిపోయాడని తల్లిదండ్రులు కుమిలిపోయారు. వైద్యుని నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయాడంటూ బంధువులు ఆరోపిస్తూ అక్కడే ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీనిపై ఎస్సై యు శ్రీనివాసులును వివరణ కోరగా.. డాక్టర్‌ సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి వద్దకు వచ్చినట్లు తెలిపారు. శిశువు తల్లిదండ్రులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదన్నారు. కాగా మృత శిశువును రాత్రి 8.10 గంటల వరకు ఆస్పత్రిలోనే ఉంచారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top