డాక్టర్‌ సుధాకర్‌పై 3 సెక్షన్ల కింద సీబీఐ కేసు

CBI case against Dr Sudhakar under 3 sections - Sakshi

డాక్టర్‌ సుధాకర్‌ మాపై తిరగబడ్డారు

మా విధులకు ఆటంకం కలిగించారు

సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు

సాక్షి, విశాఖపట్నం: నడిరోడ్డుపై ఇష్టారాజ్యంగా ప్రవర్తించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోనే నర్సీపట్నానికి చెందిన అనస్తీషియా డాక్టర్‌ సుధాకర్‌పై కేసు నమోదు చేసినట్టు సీబీఐ పేర్కొంది. ఈ మేరకు తన వెబ్‌సైట్‌లో కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని బుధవారం పొందుపర్చింది. గత నెల 16న డాక్టర్‌ సుధాకర్‌ విశాఖ పోర్టు ఆస్పత్రి సమీపంలోని జాతీయ రహదారిపై తన పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించారని ఫోర్త్‌ టౌన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాఘవేంద్ర కుమార్‌ ఎఫ్‌ఐఆర్‌ ప్రతిలో పేర్కొన్నారు.

హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటరమణ ఘటన జరిగిన రోజే సుధాకర్‌పై ఫోర్త్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్‌ సుధాకర్‌పై ఐపీసీ 353 (ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం), 427 (తుంటరి చేష్టలతో న్యూసెన్స్‌ సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం), 506 (ఎదుటి వ్యక్తులను నేరపూరితంగా బెదిరిస్తూ భయోత్పాతం సృష్టించడం) మొదలైన సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్ల ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top