కూతురు ముందే భార్య గొంతు కొసేశాడు

Brutal Murder In Orissa - Sakshi

పర్లాకిమిడి: కన్న కూతురు ఎదుటే తన భార్య గొంతు కోసి ఓ ప్రబుద్ధుడు హత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడీ ఘటన గజపతి జిల్లాలోని ఆర్‌.ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న బోడోపద వద్ద శనివారం చోటు చేసుకుంది. గత కొన్నాళ్ల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలే హత్యకు దారి తీశాయని స్థానిక సమాచారం. అయితే వారికి ఎనిమిదేళ్ల కూతురు ఉండడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి.. మోహనా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టంగిలిపొదర్‌ గ్రామానికి చెందిన సుభాష్‌ నాయక్‌ కొన్నాళ్ల క్రితం రున్నీతా అనే మహిళను వివాహం చేసుకున్నాడు.

పెళ్లయిన మూడేళ్లకే వారిద్దరి మధ్య వచ్చిన కలహాల కారణంగా రున్నీతాను సుభాష్‌ పుట్టింటికి పంపేశాడు. అప్పటి నుంచి తన కూతురితో రున్నీతా పిండికిలో ఉన్న తన పుట్టింటిలోనే నివాసముంటోంది. అయితే ఇటీవల తన కూతురును రెసిడెన్సియల్‌ స్కూల్‌లో జాయినింగ్‌ చేయాలనుకున్న రున్నీతా వాటికి సంబంధించిన ధ్రువపత్రాల కోసం తన భర్త సుభాష్‌కు ఫోన్‌ చేసింది. ఈ క్రమంలో స్పందించిన సుభాష్‌ నాయక్‌ ఆ ధ్రువపత్రాలు ఇచ్చేందుకు అంగీకరించాడు.

కూతురు జాయినింగ్‌ నిమిత్తం సుభాష్‌ నాయక్‌ దంపతులు తన కూతురితో శనివారం పిండికి నుంచి ఓ మోటారుసైకిల్‌పై ఆర్‌.ఉదయగిరికి చేరుకున్నాడు. ఆ మార్గమధ్యంలోని బడపద గ్రామం సమీపంలో మోటారుసైకిల్‌ను ఆపి, భార్య రున్నీతా గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం భార్య శవాన్ని రోడ్డు పక్కన ఉన్న ఓ కల్వర్టు కింద దాచిపెట్టి, తిరిగి కూతురుతో పిండికికి బయలుదేరాడు.

హత్య విషయాన్ని కూతురు తన తాతకు తెలపగా, ఆమె తాత మోహనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదే విషయమై సంఘటనా స్థలానికి చేరుకున్న మోహనా పోలీసులు అక్కడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, ఆర్‌.ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం అక్కడి నుంచి రున్నీతా మృతదేహాన్ని పర్లాకిమిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన ఆర్‌.ఉదయగిరి పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top