మహిళ సజీవ దహనానికి యత్నం

Boyfriend Petrol Attack on Women in Medchal - Sakshi

మహిళపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన యువకుడు

చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

షాద్‌నగర్‌ రూరల్‌: వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలం కలిసితిరిగారు. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఎలాగైనా ఆమెను కడతేర్చాలని ప్రియుడు పన్నాగం పన్నాడు. ఆ మహిళపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని మహల్‌ ఎలికట్ట గ్రామంలో చోటు చేసుకుంది. సొంత కుటుంబ సభ్యులను హత్య చేసిన నిందితుడు మరో దారుణానికి ఒడగట్టిన సంఘటన సంచలనం రేకెత్తించింది. ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని మహల్‌ ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములుకు అదే గ్రామానికి చెందిన వివాహిత మహిళ జంగం మంగమ్మతో కొంతకాలంగా సంబంధం ఏర్పడింది. వీరిద్దరు కొంత కాలంగా బాగానే ఉన్న ఇటీవల మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి.

దీంతో వీరిద్దరి మధ్య తరుచుగా గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. కొంత కాలంగా ఇరువురి మధ్య మాటలు లేకపోవడంతో మంగమ్మపై కోపం పెంచుకున్న రాములు ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పన్నాగం పన్నాడు. మంగళవారం సాయంత్రం కూలీ పనులు చేసి ఇంటికి ఒంటిరిగా వెళ్తున్న మంగమ్మను రాములు వెంబడించాడు. పథకం ప్రకారం ముందుగానే తన వెంట తెచ్చుకున్న  కిరోసిన్‌ను ఆమె ఒంటిపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. మంటలకు తాళలేక మంగమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పి ఆమెను వెంటనే షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మంగమ్మను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మంగమ్మ పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్‌ సంఘటనా స్ధలానికి చేరుకున్నారు.  అయితే ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

వాంగ్మూలం నమోదు చేసిన జడ్జి...
ప్రియుడు రాములు చేతిలో హత్యాయత్నానికి గురైన మంగమ్మ కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆశారాణి షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మంగమ్మ నుంచి  వాగ్మూలం తీసుకున్నారు. అయితే మంగమ్మను సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన రాములు పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉండి ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడు. సొంత కుటుంబ సభ్యులను హతమార్చిన రాములు తాజాగా మరో దారుణానికి పాల్పడ్డాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top