కేరళ నన్‌పై లైంగిక దాడి : పోప్‌కు బిషప్‌ లేఖ

Bishop Mulakkal Writes To Pope Francis On Kerala Nun Rape Case - Sakshi

తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్‌ చర్చి బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ తాత్కాలికంగా బిషప్‌ బాధ్యతల నుంచి వైదొలుగుతానని పేర్కొంటూ పోప్‌ ఫ్రాన్సిస్‌కు లేఖ రాశారు. న్యాయస్ధానం వెలువరించిన ఉత్తర్వుల నేపథ్యంలో చర్చి నిర్వహణ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పించాలని పోప్‌ ఫ్రాన్సిస్‌కు రాసిన లేఖలో ములక్కల్‌ కోరారు.

నన్‌పై లైంగిక దాడి కేసును విచారిస్తున్న కేరళ పోలీసుల తరపున శుక్రవారం జలంధర్‌ పోలీసులు బిషప్‌కు సమన్లు అందచేశారు. కాగా 2014 నుంచి 2016 వరకూ ములక్కల్‌ తనపై 13 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని 43 ఏళ్ల నన్‌ ఈ ఏడాది జూన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

పంజాబ్‌కు చెందిన జీసస్‌ మిషనరీలు కేరళలో రెండు కాన్వెంట్‌లను నిర్వహిస్తున్న క్రమంలో ఈ మిషనరీల్లో బాధిత నన్‌ సభ్యురాలిగా ఉన్నారు. నన్‌పై లైంగిక దాడికి పాల్పడిన బిషప్‌ అరెస్ట్‌ను డిమాండ్‌ చేస్తూ కొచ్చిలో నన్‌లు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. కాగా బిషప్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన అధికార ప్రతినిధి ఫాదర్‌ పీటర్‌ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top