ఈ బాబు... మహా ముదురు బాబూ!

Bike robberies for Stunts - Sakshi

స్టంట్స్‌ కోసం బైక్‌ చోరీలు   

పెట్రోల్‌ కోసం మొబైల్స్‌ దొంగతనం 

మరో ఆరుగురు మైనర్లతో కలసి ముఠా   

నలుగుర్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానికి చెందిన ఓ మైనర్‌.. బైకులతో స్టంట్స్‌ చేయడంలో ఎక్స్‌పర్ట్‌.. అందులో మరికొందరికి శిక్షణ కూడా ఇస్తుంటాడు.. మరో ముగ్గురు బాలురతో జట్టు కట్టాడు.. ఈ స్టంట్స్‌ చేయడానికి, రేసింగ్స్‌లో పాల్గొనడానికి అవసరమైన బైక్‌ల కోసం చోరీల బాట పట్టారు. వాటిలో పెట్రోల్‌ నింపుకోవడానికి మొబైల్‌ ఫోన్స్‌ దొంగతనం చేయడం మొదలుపెట్టారు. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ ముఠాలోని నలుగురిని పట్టుకుని వారి గుట్టు రట్టుచేశారు. 

‘సాహసాలు’అంటే మక్కువ.. 
హైదరాబాద్‌లోని సిద్ధార్థనగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు ఈసీఐఎల్‌లోని ఓ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి ఇళ్లల్లో పని చేసుకుంటూ కొడుకును పోషిస్తోంది. బైక్‌లు నడపటంలో పట్టున్న అతడికి.. స్టంట్స్‌ చేయడమంటే సరదా. స్నేహితుల వద్ద నుంచి తీసుకున్న బైక్‌లతో రోడ్లపై స్టంట్స్‌ చేస్తుంటాడు. కేబీఆర్‌ పార్క్‌ వద్ద రేసింగ్స్‌ చేసేవాడు. ఉప్పల్‌లోని భగాయత్‌ ల్యాండ్స్‌లో ప్రతి శని, ఆదివారాల్లో స్టంట్స్‌ చేయడంలో యువతకు ‘శిక్షణ’కూడా ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఇతడికి తమ ఏరియాలోనే ఉండే ముగ్గురు మైనర్లతో పరిచయం ఏర్పడింది. ఈ ముఠాకు అతగాడు గ్యాంగ్‌లీడర్‌గా మారాడు. 

స్టంట్స్‌ చేయడానికి స్పోర్ట్స్‌బైక్స్‌.. 
ఎప్పుడు కోరుకుంటే అప్పుడు స్టంట్స్‌ చేయాలంటే సొంతంగా స్పోర్ట్స్‌ బైక్‌ ఉండాలని సూత్రధారి భావించాడు. వాటిని ఖరీదు చేసే స్తోమత వారికి లేకపోవడంతో బైక్‌లను చోరీ చేయాలని పథకం వేశారు. ఇందుకు మరో ముగ్గురు మైనర్లనూ తమతో చేర్చుకున్నారు. వీరంతా కలసి గోల్కొండ, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల నుంచి మూడు బైక్స్‌ చోరీ చేశారు. వీటిలో రెండు కేటీఎంలు కాగా, మరొకటి పల్సర్‌. వీటిపై తిరిగేందుకు కావాల్సిన పెట్రోల్‌ కోసం గోపాలపురం, మహంకాళి, ఎల్‌బీనగర్‌లలో సెల్‌ఫోన్లు దొంగతనం చేశారు. వీరు దొంగిలించిన బైకులకు తప్పుడు నంబర్‌ప్లేట్లు తగిలించి రోడ్డుపై వెళ్తున్న వారి నుంచి సెల్‌ఫోన్లు లాక్కుపోయేవారు. మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మరో రెండు ఫోన్లు దొంగతనం చేశారు. 

చిక్కినా చెప్పడు...
ఈ గ్యాంగ్‌ సూత్రధారి అయిన మైనర్‌ చాలా ముదురు. పోలీసులకు చిక్కినా కూడా పూర్తి వివరాలు చెప్పేవాడు కాదు. రెండు సెల్‌ఫోన్లు దొంగిలించిన కేసులో మల్కాజ్‌గిరి పోలీసులు గత నెలలో మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో చేసిన నేరాలకు సంబంధించి నోరు విప్పలేదు. గత నెల 18న సూత్రధారి సహా ముగ్గురు మైనర్లు ఓ వాహనంపై వచ్చి క్లాక్‌టవర్‌ వద్ద సెల్‌ఫోన్‌ దొంగిలించారు. దీనిపై గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సూత్రధారిని గుర్తించారు. అతడి కదలికలపై ఆరా తీయగా.. వీకెండ్స్‌లో ఉప్పల్‌లోని భగాయత్‌లో, మామూలు రోజుల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. నిఘా పెట్టిన పోలీసులు సూత్రధారితో పాటు నలుగురు మైనర్లను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top