
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండలో దొంగ హల్‌చల్ చేశాడు. పెనుకొండలో ఉన్న యాక్సెస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశాడు. మొదట ముఖానికి ముసుగు తొడుక్కొని వచ్చిన దొంగ ఏటీఎంలోకి ప్రవేశించి.. ఏటీఎం మెషిన్ ఎక్కి మరీ.. అక్కడ ఉన్న సీసీటీటీ కెమెరాకు ముసుగు కప్పేశాడు. ఆ తర్వాత ఏటీఎం మెషిన్ నుంచి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నించాడు.
ఇందుకోసం ఏకంగా గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేశాడు. అయినా, ఏటీఎం క్యాష్ బాక్స్ తెరుచుకోలేదు. దీనికితోడు గ్యాస్ కట్టర్ల కారణంగా ఏటీఎం మెషిన్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో భయభ్రాంతులకు గురైన దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఏటీఎంలోని డబ్బులు భద్రంగా ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.