మచిలీపట్నం కలెక్టరేట్‌లో కలకలం

ACB Officials Found Dasari Prasanthi While Accepting Bribe - Sakshi

లంచం తీసుకుంటూ దొరికిన భూసంస్కరణల విభాగం ఏఓ దాసరి ప్రశాంతి 

పట్టాదార్‌ పాస్‌పుస్తకం, టైటిల్‌ డీడ్స్‌ జారీ కోసం రూ.6లక్షలు డిమాండ్‌ 

రూ.3లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు 

గతంలో ఏ.కొండూరు తహసీల్దార్‌గా ఉన్నసమయంలోనూ ఏసీబీకి చిక్కిన అధికారి

జిల్లా పాలనా కేంద్రమైన కలెక్టరేట్‌ ప్రాంగణం.. సోమవారం కావడంతో ఉదయం నుంచి ‘స్పందన’కు వచ్చిపోయే అర్జీదారులతో కిటకిటలాడుతోంది. కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, జేసీ మాధవీలత, డీఆర్వో ప్రసాద్‌ తదితర జిల్లా అధికారులంతా అర్జీదారుల నుంచి వినతులు స్వీకరిస్తూ బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కలెక్టరేట్‌లో కీలక విభాగాధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఇదే ప్రాంగణంలో ఉన్న ఇతర శాఖల కార్యాలయాలకు చెందిన పలువురు సిబ్బంది గతంలో ఏసీబీకి చిక్కినప్పటికీ, జిల్లా ఉన్నతాధికారులు కార్యాలయంలో ఉండగానే కలెక్టరేట్‌కు చెందిన ఓ అధికారి.. ఏసీబీకి చిక్కడం    సంచలనం రేపింది.    

సాక్షి, మచిలీపట్నం/చిలకలపూడి: మచిలీపట్నం కలెక్టరేట్‌లో భూసంస్కరణల విభాగం అధీకృత అధికారి(ఏఓ)గా పనిచేస్తున్న దాసరి ప్రశాంతి ఓ రైతు నుంచి రూ.3లక్షలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కారు. పట్టాదార్‌ పాస్‌ పుస్తకం, టైటిల్‌ డీడ్‌ కోసం రూ.6లక్షలు డిమాండ్‌ చేసిన ప్రశాంతి.. తొలివిడతగా రూ.3లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ ఏఎస్పీ కేఎం మహేశ్వర రాజుతో పాటు బాధిత రైతు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన మోకా రామలింగేశ్వరరెడ్డి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు వద్ద 4.53 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పసుపుకుంకుమ కింద వచ్చినట్టుగా కోర్టు నుంచి పొందిన ఆర్డర్‌ ఆధారంగా కృష్ణకుమారి అనే ఆమె నుంచి ఈ భూమిని కొనుగోలు చేసి 2.53 ఎకరాలు తన పేరిట, మరో ఎకరం తన తల్లి మోకా జయలక్ష్మి, ఇంకో ఎకరం భూమి తన సోదరి ఆళ్ల జానకీదేవి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

పట్టాదార్‌పాస్‌పుస్తకం, టైటిల్‌ డీడ్స్‌ కోసం 2016లో ఏ.కొండూరు తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేయగా, ఆ భూమి ల్యాండ్‌ సీలింగ్‌లో ఉన్నట్టుగా స్థానిక అధికారులు చెప్పారు. దీంతో నూజివీడు ఆర్డీఓను ఆశ్రయించగా, అక్కడ నుంచి కలెక్టరేట్‌కు ఫైల్‌ చేరింది. అప్పట్లోనే ఈ పని నిమిత్తం రూ.5 లక్షలు ముట్టజెప్పిన రామలింగేశ్వర రెడ్డి 2017 నుంచి కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం ఫైనల్‌ నోటీసులు జారీ చేస్తున్న సమయంలో ఏఓ ప్రశాంతి బాధిత రైతునకు సమాచారం పంపారు. మీ చేతికి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, టైటిల్‌ డీడ్స్‌ కావాలంటే కనీసం రూ.6లక్షలు ఖర్చవుతాయని అందుకు సిద్ధమైతే కలెక్టరేట్‌ రావాలని సూచించారు. దీనిపై రైతు రామలింగేశ్వరరావు తాను రూ.6 లక్షలు ఇవ్వలేనని స్పష్టం చేయడంతో.. ముందు మీ దగ్గర ఎంత ఉంటే అంత పట్టుకురండి మిగిలిన డబ్బుల సంగతి ఆ తర్వాత చూద్దామని సూచించారు. దీంతో ఆమె అడిగిన డబ్బులు ఇచ్చినా పని అవుతుందో లేదోనన్న ఆందోళనతో రామలింగేశ్వరారవు విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశారు.
 
ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు 
రూ. 10లక్షలు ఇవ్వాలంటూ.. 
ఏసీబీ ఏఎస్పీ మహేశ్వరరాజు సూచన మేరకు రూ.3లక్షలు కవర్‌లో పెట్టి నేరుగా కలెక్టరేట్‌ పై అంతస్తులో ఉన్న భూసంస్కరణల విభాగానికి సోమవారం మధ్యాహ్నం 1గంట సమయంలో చేరుకున్న రామలింగేశ్వరరెడ్డి సెక్షన్‌లో అందరూ చూస్తుండగానే డబ్బులతో ఉన్న కవర్‌ను ఆమెకు అందజేసి ఇందులో రూ.3 లక్షలున్నాయి, ఇక ఇవ్వలేను తీసుకుని మా భూమికి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, టైటిల్‌ డీడ్స్‌ ఇప్పించాలని వేడుకున్నారు. రూ.3లక్షలు కాదు కదా, రూ.6లక్షలు ఇచ్చినా కుదరదు. కనీసం రూ.10 లక్షలు ఇస్తే కాని మీ పని అవదు గుర్తించు కోండి అని బదులిచ్చింది. ఈ డబ్బులేమైనా నా ఒక్కదానికే అనుకున్నారా? కలెక్టర్‌ట్‌లోని ఓ ఉన్నతాధికారితో పాటు సంబంధిత విభాగాల అధికారులకు కూడా ముట్టజెప్పాలి తెలుసా అని చెప్పుకొచ్చారు.
 
కవర్‌ సొరుగులో వేస్తుండగా.. 
కవర్‌లో ఉన్న సొమ్ములను తన టేబుల్‌ సొరుగులో వేస్తుండగా ఏసీబీ ఎఎస్పీ మహేశ్వరరాజు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. టేబుల్‌ సొరుగులో ఉన్న నగదును స్వా«దీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఏఓ ప్రశాంతిని అదుపులోకి తీసుకున్నారు. పట్టాదార్‌పాస్‌ పుస్తకం, టైటిల్‌ డీడ్స్‌ జారీ కోసం తనను చాలా ఇబ్బంది పెడుతున్నారని, రూ.6లక్షలు డిమాండ్‌ చేశారని చెప్పడంతో తాము వలపన్ని డబ్బులు సొరుగులో వేసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా మని ఏసీబీ ఏఎస్పీ మహేశ్వరరాజు మీడియాకు తెలిపారు. అరెస్ట్‌ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు çపర్చనున్నట్టు చెప్పారు. 

ఐదేళ్లు నరకం చూశా.. 
పట్టాదార్‌ పాస్‌ పుస్తకం, టైటిల్‌ డీడ్‌ కోసం గడిచిన ఐదేళ్లుగా చెప్పులరిగేలా తిరిగా. గతంలో రూ.5 లక్షలు ఇచ్చా. మళ్లీ రూ.6లక్షలు డిమాండ్‌ చేశారు. ఇక చేసేది లేక ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చా. రెవెన్యూలో సామాన్యులను చాలా     ఇబ్బంది పెడుతున్నారు. 
– మోకా రామలింగేశ్వరరెడ్డి, బాధిత రైతు 

గతంలో పట్టుబడినా.. మారని తీరు
తహసీల్దార్‌గా ఏ.కొండూరులో పనిచేసిన సమయంలో ఇదే రీతిలో చేతివాటం ప్రదర్శించి ఏసీబీ అధికారులకు దొరికిపోయినా ఆమె తీరులో మాత్రం మార్పు రాలేదు. రేపూడి తండా గ్రామానికి చెందిన బి.గోలిరాజు అనే గిరిజన రైతు తనకు చెందిన రెండెకరాల వ్యవసాయ భూమికి పట్టాదార్‌పాస్‌పుస్తకం 

జారీ కోసం రూ.8వేలు లంచం తీసుకుంటూ
డగా 2014 మే 5వ తేదీన ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెన్షన్‌కు గురయ్యారు. కొంతకాలం ఏ పోస్టింగ్‌ లేకుండా ఉన్న ఆమె టీడీపీ ప్రజాప్రతినిధులతో పైరవీలు చేయించుకుని కలెక్టరేట్‌లోని కీలక విభాగమైన భూసంస్కరణల ఏఓగా పోస్టింగ్‌ పొందారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top