గోదారమ్మ మింగేసిందా?

3 Childrens Missing In East Godavari Boat Capsized - Sakshi

లభించని ముగ్గురు చిన్నారుల జాడ

బుధవారం విఖ్యాత్‌రెడ్డి మృతదేహమే లభ్యం

సాక్షి , విశాఖపట్నం: తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు సమీపాన గత నెల 15న గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో జిల్లాకు చెందిన 17మంది గల్లంతయ్యారు. ఆ దుర్ఘటనలో గల్లంతైన ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. ఘటన జరిగిన  రోజు నుంచి చేపట్టిన గాలింపు చర్యల్లో 13మంది మృతదేహాలను గుర్తించి జిల్లాకు తీసుకువచ్చారు. ఆరిలోవకు చెందిన తలారి అప్పలరాజు, భాగ్యలక్ష్మి కుమార్తెలైన వైష్ణవి(3), ధాత్రి అనన్య(ఏడాదిన్నర), రామలక్ష్మీ కాలనీకి చెందిన దివంగత మధుపాడ రమణబాబు. అరుణకుమారిల కుమారుడు అఖిలేష్‌(9), గాజువాకకు చెందిన దివంగత మహేశ్వరరెడ్డి, స్వాతిల కుమారుడు విఖ్యాత్‌రెడ్డి(6).. మొత్తంగా ఈ  నలుగురు చిన్నారుల ఆచూకీ మాత్రం లభించలేదు.

గోదావరిలో వరద ఉధృతి కారణంగా నెల కిందట గాలింపు చర్యలు నిలిపివేసిన దరిమిలా.. మళ్ళీ రెండు రోజుల కిందట ఏకంగా బోటును ఒడ్డుకు తీసుకువచ్చి దాంట్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తూ వచ్చారు. ఇందులో గాజువాకకు చెందిన విఖ్యాత్‌రెడ్డి మృతదేహం మాత్రం లభ్యమైంది. విఖ్యాత్‌రెడ్డి తల్లిదండ్రులు మహేశ్వరరెడ్డి, స్వాతిలతో పాటు సోదరి హన్సిక కూడా అదే బోటు ప్రమాదంలో మృతిచెందారు. వారి మృతదేహాలను గత నెల 23వ తేదీన బంధువులకు అప్పగించారు. ఇద్ద రు పిల్లలతో సహా మహేశ్వరరెడ్డి కుటుంబం మొత్తం బోటు ప్రమాదానికి బలైపోయిందని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆ ముగ్గురూ అంతేనా..
కనీసం విఖ్యాత్‌రెడ్డి చివరిచూపైనా దక్కిందనుకుంటే మిగిలిన ముగ్గురు చిన్నారుల జాడ కానరాకపోవడంతో వారి రక్తసంబంధీకులు తల్లిడిల్లిపోతున్నారు. ఇప్పటికీ ఆచూకీ తెలియని   అఖిలేష్‌(9) తల్లిదండ్రులు మధుపాడ రమణబాబు. అరుణకుమారి, సోదరి కుశాలి.. ఈ ముగ్గురూ ఆ బోటు ప్రమాదంలో మృతిచెందారు. అఖిలేష్‌ ఆచూకీ కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నాం... పోనీ బాడీ దొరికినా చాలని అనుకుంటున్నాం... అని అతని చిన్నాన్న రామకృష్ణ గద్గదస్వరంతో అన్నారు. ఆ ముగ్గురికీ దహన సంస్కారం చేశాం.. చివరికి అఖిలేష్‌కి ఆ కర్మక్రియలు కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చిందంటూ విలపించారు. 

ఆరిలోవకు చెందిన తలారి అప్పలరాజు, భాగ్యలక్ష్మిలది నిజంగా గుండెలు పిండే విషాదం. ఇద్దరు ఆడపిల్లలు వైష్ణవి(3), ధాత్రి అనన్య(ఏడాదిన్నర)లను రెండు కళ్ళల్లా అల్లారుముద్దుగా పెంచుతూ వచ్చారు. నానమ్మ అప్పలనర్సమ్మ, బంధువులతో కలిసి ఆ  రోజు గోదావరి బోటు షికారుకు వెళ్ళారు. అప్పలనర్సమ్మ మృతదేహం బయటపడినా పసి పిల్లల ఆచూకీ మాత్రం నేటికీ తెలియలేదు. మా కంటిపాపలు కానొస్తే చాలు.. మేమే పాపం చెయ్యలేదు. కానీ భగవంతుడు ఎందుకు ఇంత విషాదం కలిగించాడో.. అర్థం కావడం లేదు. 30 రోజులకు పైగా మా మరిది శ్రీనివాస్‌ గోదావరి ఒడ్డునే ఉంటున్నాడు. ఎక్కడైనా కానొస్తారేమో లేదా.. పోనీ.. పోయిన ప్రాణాలతోనైనా కనిపిస్తారేమోనని అక్కడే పడిగాపులు కాస్తూ వచ్చాడు. కానీ.. ఇక కడచూపు ఆశ కూడా దక్కనట్టేనని అనిపిస్తోంది.. అని ఆ చిన్నారుల తల్లి భాగ్యలక్ష్మి గుండెలవిసేలా రోదిస్తూ చెప్పింది.

చదవండి : కడసారి చూపు కోసం..
చదవండి : ఏడు మృతదేహాలు మార్చురీకి తరలింపు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top