ఫోరంమాల్‌లో సచిన్‌ సందడి | Sachin Tendulkar Open Smash Centre In Kukatpally Foru Mall | Sakshi
Sakshi News home page

ఫోరంమాల్‌లో సచిన్‌ సందడి

Apr 20 2018 8:14 AM | Updated on Apr 20 2018 8:14 AM

Sachin Tendulkar Open Smash Centre In Kukatpally Foru Mall - Sakshi

కేపీహెచ్‌బీకాలనీ: భారత దిగ్గజ క్రికెట్‌ ఆటగాడు, భారతరత్న సచిన్‌ టెండూల్కర్‌ కూకట్‌పల్లి ఫోరం మాల్‌లో సందడి చేశారు. ఎస్‌వీఎంను ఫోరంమాల్‌ చేజిక్కించుకున్న తర్వాత ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన స్మాష్‌ సెంటర్‌ను గురువారం సచిన్‌ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా స్మాష్‌ సెంటర్‌లో పిన్‌స్ట్రైక్‌ జాతీయ కార్పొరేట్‌ బౌలింగ్‌ టోర్నమెంట్‌ ఫైనల్స్‌ను నిర్వహించారు. ఇందులో హైదరాబాద్‌ ఇన్ఫోసిస్‌ జట్టు విజేతగా నిలవగా... హెచ్‌సీఆర్, ముంబై జట్లు వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. వీరికి సచిన్‌ బహుమతులను అందజేశారు. విజేతగా నిలిచిన హైదరాబాద్‌ ఇన్ఫోసిస్‌ జట్టుకు 3 లక్షల నగదుతో పాటు కప్‌ను అందించారు. సచిన్‌ ఫోరంమాల్‌కు రావడంతో అభిమానులు పోటెత్తారు. వేలాదిమంది క్రికెట్‌ అభిమానులు లిటిల్‌ మాస్టర్‌ను చూసి కేరింతలు కొట్టారు. 

స్టేడియంలో ఉన్న భావన కలిగింది: సచిన్‌
తనను చూడటానికి పోటెత్తిన క్రీడాభిమానులను చూడగానే స్టేడియంలో ఉన్న భావన కలిగిందని సచిన్‌ అన్నాడు. సచిన్‌...సచిన్‌ అంటూ హోరెత్తిన నినాదాలు తనను ఉద్వేగానికి గురిచేశాయన్నాడు. హైదరాబాద్‌తో, ఇక్కడి ప్రజలతో తనకు ఎంతో అనుబంధముందన్నాడు. ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, బిర్యానీ రుచి ఎన్నటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఖాళీ దొరికినప్పుడల్లా కుటుంబంతో గడపడంతో పాటు గేమింగ్‌ కేంద్రాలకు వెళ్ళి వివిధ క్రీడలను ఆస్వాదిస్తానని సచిన్‌ తెలిపారు. ప్రధానంగా స్మాష్‌ వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమింగ్‌ సెంటర్లలో కార్‌ రేసింగ్, వర్చువల్‌ రియాలిటీ, ఆర్కేడ్‌ గేమింగ్‌ వంటివి ఎక్కువగా ఆస్వాదిస్తానని తెలిపారు. కుటుంబంతోనూ, స్నేహితులతోనూ గేమింగ్‌ కేంద్రాలకు వెళ్ళడం ద్వారా శారీరకంగానూ, మానసికంగానూ దృఢంగా మారవచ్చని చెప్పారు. పట్టణ జీవన విధానంలో గేమింగ్‌ కేంద్రాలకు ఆదరణ పెరిగిందన్నారు. అనంతరం స్మాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ డైరెక్టర్‌ విజయేందర్‌ తూళ్ల మాట్లాడుతూ ఎస్‌వీఎంను చేజిక్కించుకున్న తరువాత స్మాష్‌కు హైదరాబాద్‌లోని 5 కేంద్రాలతో పాటు, బెంగళూరుతో కలిసి మొత్తం దక్షిణ భారతదేశంలో 9 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్మాష్‌ మార్కెటింగ్‌ ఉపాధ్యక్షుడు నీలేందు మిత్రా, తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement