
సాక్షి, తిరుపతి కల్చరల్: శ్రీకపిలేశ్వరస్వామి వారి ఆలయంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న స్వామివారి తెప్పోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. చివరిరోజు సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు శ్రీచండికేశ్వరస్వామి, శ్రీచంద్రశేఖరస్వమి వారు తెప్పలను అధిరోహించి విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
తెప్పోత్సవాల్లో భాగంగా తొలిరోజు శ్రీవినాయకస్వామి, రెండవ రోజు శ్రీసుబ్రమణ్యస్వామి, మూడవ రోజు శ్రీసోమస్కందమూర్తి, నాల్గవ రోజు శ్రీకామాక్షి అమ్మవారు తెప్పలపై కొలువుతీరి పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ముగింపు సందర్భంగా శ్రీచండికేశ్వరస్వామి, శ్రీచంద్రశేఖర స్వామి సర్వాంగ సుందర అలంకరణ ప్రియులై తెప్పలపై కొలువు తీరి పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగి భక్తులను కనువిందు చేశారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సుమధుర భక్తి సంకీర్తనలను గానం చేసి భక్తులను అలరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, ఏఈవో శంకర్‌రాజు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కాగా, మంగళవారం ఆరుద్ర దర్శన మహోత్సవంలో సందర్భంగా ఉదయం 5.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీనటరాజస్వామి, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీమాణిక్య వాసగ స్వామి ఉత్సవమూర్తులు పురవీధుల్లో ఘనంగా ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.