సౌకర్యాలకు ప్రాధాన్యం 

Traders in the real estate ventures are preferred by modern facilities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జిల్లాలో దూసుకువస్తున్న స్థిరాస్తి వెంచర్లలో వ్యాపారులు ఆధునిక సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇరుకు రహదారులు, కాలుష్యం, ఇతర అసౌక్యాలకు నిలయంగా ఉన్న నగర జీవితాన్ని మరిచిపోయేలా మదిని మైమరిపించే అనేక అత్యాధునిక సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందమైన ప్రకృతిని వెంచర్లలో నెలకొల్పి కలల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. 40 అడుగుల రోడ్లు, ఫైవ్‌ స్టార్‌ సౌకర్యాలు, అందమైన ఆర్కిటెక్చర్‌ డిజైన్లకు ప్రాధాన్యం ఇచ్చేలా వెలుస్తున్న ఈ వెంచర్లు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. స్థలం ఎంపిక నుంచి లే అవుట్‌ డిజైన్, మౌలిక వసతుల రూపకల్పన, పర్యావరణానికి నేడు అందరూ ప్రాధాన్యం ఇస్తుండటంతో స్థిరాస్తి వ్యాపారులు కూడా ఆ మేరకు కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త వెంచర్లను వేస్తున్నారు. ఖర్చు చేసే ప్రతి రూపాయికి అధిక విలువ తెచ్చేందుకు ప్రాధాన్యమిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. 

పచ్చని మొక్కలతో.. 
నగర జీవితమంటే ప్రధానంగా కాలుష్యం చెంతనే అనేది నానుడి. జగమెరిగిన ఈ సత్యాన్ని కలలో సైతం రానీయకుండా నగర శివారు ప్రాంతాల్లో కాలుష్యానికి చెక్‌ పెడుతూ సరికొత్త ఏర్పాట్లు చేస్తున్నారు. విశాలమైన రోడ్లపై ఇరువైపులా పచ్చని మొక్కలు పెంచటమే కాకుండా వాటి పర్యవేక్షణకు సంస్థలే ప్రాధాన్యం ఇస్తున్నాయి. పచ్చని పార్కులు ఆపై అందమైన డిజైన్లతో కొనుగోలుదారులకు సౌకర్యాల కల్పనలో పోటీపడుతున్నాయి. అతి తక్కువ ధరలో వాయిదాల పద్ధతిలో సైతం ఇళ్ల స్థలాలు లభ్యం కావటంతో మధ్య తరగతి కుటుంబాలు సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. 

రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు.. 
వెంచర్ల ఏర్పాటులో రక్షణకు కూడా సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆకర్షణీయమైన ముఖ ద్వారంతో స్వాగతం పలుకుతూ 60, 40, 40 ఫీట్ల రహదారులను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ ఇబ్బంది లేకుండా భూగర్భ కేబుల్స్‌ వేయటంతో పాటూ కొన్ని సంస్థలు ప్రహారీ గోడ మీద సౌర విద్యుత్‌ కంచెను ఏర్పాటు చేస్తున్నాయి. 24 గంటల పాటు సెక్యూరిటీ ఏర్పాటుతో కొనుగోలుదారులు ప్రశంసలు పొందుతున్నారు.  

స్టార్‌ హోటల్‌ వసతులు.. 
నేటి యువత అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తోంది. ఇంటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఉద్యోగ ఒత్తిడి నుంచి సాంత్వన పొందే ఇంటి నిర్మాణాలపై ఆసక్తి చూపిస్తోంది నేటి యువత. దీనికి తగ్గట్టుగానే కొంత మంది వ్యక్తిగత గృహాలు ఇష్టపడుతుంటే, మరికొంత మంది అపార్ట్‌మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు తగ్గ ట్టుగానే వ్యాపారులు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు.

త్రిబుల్‌ బెడ్‌కు డిమాండ్‌
వ్యక్తిగత గృహాలైనా సరే త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ నిర్మాణం వైపు నేటి యువత ఆసక్తి చూపిస్తుంది. పార్కింగ్, పచ్చని ఆవరణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు 300–500 చదరపు గజాల విస్తీర్ణమున్న ప్లాట్లను వేస్తున్నారు. అందమైన డిజైన్లతో విల్లాలతో పోటీ పడే ఇటువంటి నిర్మాణాలు నేటి యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.

ఉడెన్‌ ఫ్లోరింగ్‌
అందానికి, హోదాకి చిహ్నం ఉడెన్‌ ఫ్లోరింగ్‌. దీని నిర్వహణ పెద్ద కష్టమేమీ కాదు. దుమ్ము, ధూళి, ఇసుక, మట్టి వంటివి ఉడెన్‌ ఫ్లోర్‌కు శత్రువులు. ఇవి గీతలను సృష్టించడమే కాకుండా కాంతి విహీనం చేస్తాయి. అందుకే అవి దరిచేరకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తరుచుగా మెత్తటి గుడ్డతో శుభ్రం చేస్తుండాలి.  ఫ్లోర్‌ను వ్యాక్స్, వార్నిష్, పాలియుథరిన్‌తో ఫినిషింగ్‌ చేయించుకుంటే.. ఆ నేల మీద ఆహారపదార్థాలు, ద్రవాలు పడకుండా జాగ్రత్త వహించాలి. లేదంటే గచ్చు కాంతి మాయం అవుతుంది. పొరపాటున సిరా లేదా నీళ్లు ఒలికితే ముందుగా ఉడెన్‌ ఫ్లోర్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. తర్వాత వెనిగర్‌ కలిపిన నీటిలో ముంచిన మెత్తటి గుడ్డతో తుడిచేయాలి. అనంతరం పొడి బట్టతో తుడిస్తే సరిపోతుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top