ఎవరెస్ట్‌ యమ డేంజర్.. పది వేల అడుగులు దాటితే..

Nepal Grants Record Climbing Permits For Mount Everest - Sakshi

విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్న నేపాల్‌ ప్రభుత్వం

ఈ ఏడాది 12 మంది మృతి, ఏడుగురు గల్లంతు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్‌ ఎవరెస్ట్‌. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా వెండి కొండలా ధగధగలాడిపోతూ మంచుతో నిండిపోయిన ఈ పర్వత శిఖరం చేరుకోవడమంటే ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవడమే. అందుకే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నా, ప్రాణాలతో తిరిగి వస్తామన్న భరోసా లేకపోయినా ప్రతీ ఏడాది ఎందరో సాహసికులు ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవాలని తమ దేశ జెండాని పాతాలని ఆరాటపడుతుంటారు.

మౌంట్‌ ఎవరెస్ట్‌ను తొలిసారి ఎక్కడం ప్రారంభించి 70 ఏళ్లయింది. 1953 సంవత్సరం మే 29న న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్‌ హిల్లరీ భారత్‌కు చెందిన టెన్జింగ్‌ నార్గేలు ఎవరెస్ట్‌ శిఖరాగ్రం చేరుకున్నారు. ఈ 70 ఏళ్లలో కనీవినీ ఎరుగని మార్పులు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఆధునిక సదుపాయాలు చోటు చేసుకోవడంతో ఎవరెస్ట్‌ అధిరోహించే వారి సంఖ్య భారీగా పెరిగింది.

ఎవరెస్ట్‌పై ట్రాఫిక్‌ జామ్‌
పర్వతారోహకులకు ఈ ఏడాది నేపాల్‌ ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు మంజూరు జారీ చేయడంతో ఎవరెస్ట్‌ అధిరోహణ మరింత ప్రమాదకరంగా మారింది. అసాధారణ రీతిలో 900 మంది పర్వతారోహకులకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొండపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు కనిపించాయి. శిఖరాగ్రం చేరుకోవాలంటే 26 వేల అడుగులు పైకి వెళ్లాలి. పది వేల అడుగులు దాటితే ఇంక మృత్యువు ముఖంలోకి అడుగు పెట్టినట్టే. అంత ఎత్తులో ఆక్సిజన్‌ సరిగా అందదు. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతుంది. రక్తం గడ్డ కట్టేలా వాతావరణం మైనస్‌ 20 డిగ్రీలకు పడిపోతుంది.

శారీరకంగా ఎంత ఫిట్‌నెస్‌ ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి ప్రాణాలు పోతాయి. సముద్ర మట్టానికి అంత ఎత్తుకు చేరుకుంటే ఒక్కోసారి మెదడు, ఊపిరితిత్తులకు వాపు వచ్చి శరీరంపై స్వాధీనం కోల్పోతారు. ఈ సారి ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు మంచులో గల్లంతయ్యారు. ఇటీవల ఈ స్థాయిలో మరణాలు ఎప్పుడూ సంభవించలేదు. ‘‘ఒకేసారి పర్వతారోహకులు కొండ ఎక్కుతూ ఉంటే వారికి ఆక్సిజన్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆక్సిజన్‌ ఏర్పాటు చేయడం అత్యంత ముఖ్యం. మా ద్వారా ఎవరెస్ట్‌ అధిరోహించే పర్వతారోహకులెవరూ ఇప్పటివరకు ఏ సమస్య ఎదుర్కోలేదు’’అని ఆస్ట్రియాకు చెందిన లుకాస్‌ ఫర్టెన్‌బాచ్‌ అనే కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది తమ సంస్థ తరఫున 100 మంది దిగ్విజయంగా ఎవరెస్ట్‌ ఎక్కి వచ్చారని చెప్పారు.

వాతావరణ మార్పులతో పెరుగుతున్న ముప్పు  
ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు ఎవరెస్ట్‌ అధిరోహకులకు అతి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. 1979 నుంచి చూస్తే గత 40 ఏళ్లలో ఎవరెస్ట్‌పై ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగాయి. దీంతో హిమానీ నదాలు కరిగి మంచు చరియలు విరిగి పడటం వంటిæ ప్రమాదాలు ముంచుకొస్తాయి. కొన్నేళ్లుగా ఎవరెస్ట్‌ అధిరోహించే వారు ఈ మార్పుల ప్రభావం విపరీతంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పదేళ్లలో ఎవరెస్ట్‌ ఎక్కే మార్గం ఎలా మారుతుందో ఊహకి కూడా అందడం లేదని నేపాల్‌ మౌంటనీరింగ్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు ఆంగ్‌ షెరింగ్‌ పేర్కొన్నారు.  

ఆదాయానికి ఆశపడి..?
నేపాల్‌కు పర్యాటకమే ప్రధాన ఆధారం. ఎవరెస్ట్‌ అధిరోహణ నుంచే అధికంగా ఆదాయం సమకూరుతుంది. పశ్చిమ దేశాల నుంచి వచ్చే పర్వతారోహకుల నుంచి11 వేల డాలర్లు (రూ.9 లక్షలు) చొప్పున వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే కాకుండా వెంట తీసుకు వెళ్లే ఆక్సిజన్, ఆహారం, గైడ్‌ల కోసం మొత్తంగా ఒక్కొక్కరికి 27 వేల డాలర్లు (దాదాపుగా రూ.22 లక్షలు) ఖర్చు అవుతుంది. అయితే నేపాల్‌ ప్రభుత్వం ఆదాయానికి ఆశపడే అనుమతులు ఎక్కువగా ఇస్తున్నామన్న ఆరోపణల్ని తోసిపుచ్చింది. ప్రతీ పర్వతారోహకుడి ప్రాణ రక్షణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బేస్‌ క్యాంప్‌లో వైద్యులు, అధికారుల బృందం ఈ సాహస యాత్రను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది.

ఏదైనా సాధ్యమే
ప్రపంచంలో ఎవరెస్ట్‌ మ్యాన్‌గా పేరు పొందిన నేపాల్‌కు చెందిన షెర్పా కామి రిటా 28 సార్లు ఎవరెస్ట్‌ ఎక్కిన వ్యక్తిగా నిలిచి తన రికార్డు తానే బద్దలు కొట్టాడు. ఈ ఏడాది వారం రోజుల తేడాలో రెండు సార్లు శిఖరాగ్రానికి చేరుకున్నాడు. తన రికార్డుని పసాంగ్‌ దావా అనే షెర్పా సమం చేయడంతో ఆ మరుసటి రోజే మళ్లీ ఎక్కి అత్యధికసార్లు ఎవరెస్ట్‌ని ఎక్కిన వ్యక్తిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఇక బ్రిటన్‌కు చెందిన మాజీ సైనికుడు హరి బుధా మాగర్‌ కృత్రిమ కాలుతో ఎవరెస్ట్‌ ఎక్కిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు. మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు. ఒక మలేసియన్‌ పర్వతారోహకుడు అనారోగ్యం బారిన పడితే నేపాలీ గైడ్‌ గెల్జీ అతనిని మోసుకుంటూ కొండ దిగడం మరో అరుదైన ఫీట్‌గా నమోదైంది. ఎవరెస్ట్‌ శిఖరాగ్రానికి చేరితే ప్రపంచాన్నే జయించినంత ఆనందం వస్తుంది కాబట్టే ప్రాణాలకు తెగించి మరీ ఎవరెస్ట్‌ ఎక్కే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top