సొంతింటికి దారి ఇదీ..!

Tax exemption and GST cut in real estate - Sakshi

బడ్జెట్‌లో రియల్టీకి పలు ప్రయోజనాలు...

ఆదాయపన్ను పరంగానూ పెద్ద ఉపశమనం

సొంతింటికి ప్లాన్‌ చేసుకునేందుకు అనుకూలతలు

రుణం తీసుకోవాలంటే చూడాల్సినవి కొన్ని ఉన్నాయ్‌

డౌన్‌ పేమెంట్, రుణ కాల వ్యవధి, ఈఎంఐ కీలకం

పిల్లల ఉన్నత విద్య, అత్యవసరాలూ పరిగణనలోకి...  

ఇంటి కొనుగోలును ఆకర్షణీయం చేసే పలు నిర్ణయాలను మోదీ సర్కారు ఇటీవలి బడ్జెట్లో ప్రకటించింది. అందుబాటు గృహాలపై బిల్డర్లకు పన్ను రాయితీలను 2019–20 వరకు పొడిగించింది. అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లపైనా పన్ను మినహాయింపు రెండేళ్లకు పొడిగించారు. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే పన్ను మినహాయింపునిచ్చారు. దీనికి పైన మరో రెండు లక్షల ఆదాయం ఉన్న వారు రుణంపై ఇంటిని తీసుకుని వడ్డీ రూ.2 లక్షలు చెల్లించడం ద్వారా మొత్తం ఆదాయంపై పన్ను లేకుండా ప్రయోజనం పొందొచ్చు.

త్వరలో ఇళ్లపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వచ్చేందుకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక బడ్జెట్‌కు ముందే, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద వడ్డీ సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగించడం జరిగింది. ఇవన్నీ కలసి మధ్యతరగతి జీవులు సొంతింటి కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే, ఈ విషయంలో కచ్చితంగా దృష్టిపెట్టాల్సిన కొన్ని అంశాలున్నాయి. అవేంటో చూడండి మరి...

ఇల్లు కొనుగోలు అన్నది ఆర్థికంగా ఓ పెద్ద నిర్ణయం. ఈ విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తుంటారు. సొంతిల్లును సమకూర్చుకోవడాన్ని చాలా ముఖ్యమైన విషయంగా చూస్తారనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. నిజానికి ఇది ఆర్థిక కట్టుబాటు కూడా. అందుకే ఇంటి కొనుగోలుకు సిద్ధమైన వారు ముందుగా చూడాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. రుణంతో మొదటి సారి ఇంటిని కొనాలనుకునే వారు.. డౌన్‌ పేమెంట్‌ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నెలవారీ సమాన వాయిదాల (ఈఎంఐ)ను సక్రమంగా చెల్లించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేసుకోవాలి. వీటికి తోడు మరెన్నో అంశాలు ఇంటి కొనుగోలు సామర్థ్యాలను నిర్ణయిస్తాయి. అవన్నీ పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయాలి.  

డౌన్‌ పేమెంట్‌...
ఇంటి రుణానికి డౌన్‌ పేమెంట్‌ తప్పనిసరి. ఓ ఇంటి కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చులో కొంత శాతాన్ని రుణం తీసుకోదలిచిన వ్యక్తి తన వంతుగా రెడీ చేసుకోవాల్సినదే డౌన్‌ పేమెంట్‌. రుణాలిచ్చే సంస్థలు సాధారణంగా ఇల్లు కొనుగోలు వ్యయంలో 20 శాతం డౌన్‌పేమెంట్‌ కింద అడుగుతాయి. ఉదాహరణకు రూ.50 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేసే వారు కనీసం తమ వంతుగా రూ.10 లక్షలను డౌన్‌పేమెంట్‌గా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన రూ.40 లక్షలను బ్యాంకులు రుణంగా ఇస్తాయి. ఇంటి కొనుగోలు విలువ... డౌన్‌పేమెంట్‌ ఎంతన్నది నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈ మొత్తం లేకపోతే ఇంటి
రుణం సాధ్యం కానట్టే.  

అత్యవసరాలనూ దృష్టిలో ఉంచుకోవాల్సిందే
జీవితంలో అత్యవసరాలు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. వాటిని తప్పించుకోలేం. అటువంటి పరిస్థితులను అధిగమించేందుకు ముందే తగిన విధంగా సన్నద్ధం కావాలి. సొంతింటి కోసం అప్పటి వరకు పొదుపు చేసిన మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌ కోసం వినియోగిస్తే... వేతనంలో మిగిలేదంతా ఈఎంఐగా పోతుంటే... అత్యవసరం ఎదురైతే ఏంటి పరిస్థితి? ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే..? అందుకే అత్యవసర నిధిని పక్కన పెట్టి మిగిలిన మొత్తానే డౌన్‌పేమెంట్‌గా వాడుకోవడం వివేకం. కనీసం ఆరు నెలల కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్నే అత్యవసర నిధిగా ఉంచుకోవాలి. అలాగే, ఇంటి రుణం తీసుకునే వారు, అత్యవసర నిధికి అదనంగా మూడు నెలల ఈఎంఐ మొత్తాన్ని కూడా విడిగా రెడీగా ఉంచుకోవాలి.  

ముఖ్య లక్ష్యాల కోసం పెట్టుబడులు...
డౌన్‌ పేమెంట్‌ను సమకూర్చుకుని, అత్యవసర నిధిని పక్కన పెట్టి, నెలవారీ ఈఎంఐ చెల్లించడంతోనే అన్ని బాధ్యతలు తీరినట్టు కాదు. జీవితంలో కీలకమైన లక్ష్యాలు వేరేవీ ఉన్నాయి. పిల్లల ఉన్నత విద్య ఇందులో ఎంతో ముఖ్యమైనది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. పిల్లల ఉన్నత విద్య వంటి కీలక లక్ష్యాలకు అవసరమైనంత సమకూర్చుకునేందుకు ప్రతి నెలా కొంత మేర ఇన్వెస్ట్‌ చేస్తుండాలి. దీనికి తోడు స్వల్పకాల లక్ష్యాలు ఏవైనా ఉన్నాయా అన్నది చూసుకోవాలి. వీటికి పెట్టుబడులు పోను వేతనంలో ఎంత మిగులుతుంది, ఎంత ఈఎంఐగా చెల్లించగలరన్నది నిర్ణయించుకోవాలి. చాలా మంది సొంతింటిని సమకూర్చుకునే విషయంలో కీలకమైన పెట్టుబడులు, అత్యవసరాలను విస్మరిస్తుంటారు. ఈఎంఐ మొత్తాన్ని నిర్ణయించుకోవడంలోనూ అన్ని అంశాలను చూడరు. అందుకే ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి రావాలి.  

ఈఎంఐ ఎంత మేర...?
డౌన్‌ పేమెంట్‌ అవసరమైనంత ఉన్న వారు చూడాల్సిన తదుపరి అంశం ఈఎంఐ. రుణం తీసుకుంటే నెలవారీగా ఈఎంఐ మొత్తాన్ని చెల్లించగల సామర్థ్యం ఉందా? అనేది చూడాలి. కట్టగలమన్న నమ్మకం వేరు, సామర్థ్యం వేరు. ఉదాహరణకు మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐ మొత్తం 30–40 శాతాన్ని మించరాదనేది పాటించాల్సిన సూత్రం. ఇక ఈఎంఐ ఎంతన్నది రుణం ఎంత తీసుకుంటున్నారనే అంశంతోపాటు, ఎంత కాలానికి తీసుకుంటున్నారనేదీ నిర్ణయిస్తుంది.  ఉదాహరణకు నెలవారీ ఆదాయం రూ.75,000 ఉందనుకుంటే... 9.5 శాతం వడ్డీ రేటు ప్రకారం ఎంత కాలానికి, ఎంత రుణం తీసుకుంటే ఈఎంఐ ఎంత ఉంటుందంటే...  

ఆదాయంలో ఈఎంఐ 20%
► రూ.18 లక్షల ఇంటికి 20 శాతం డౌన్‌ పేమెంట్‌ పోను బ్యాంకులు రూ.14.4 లక్షల రుణం ఇస్తాయి. 15 ఏళ్ల కాలానికి తీసుకుంటే 9.5 శాతం వడ్డీ రేటు ప్రకారం ఈఎంఐ రూ15,000 అవుతుంది. అంటే రూ.75,000 నెలసరి ఆదాయంలో 20 శాతాన్ని ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది.  

► రూ.20 లక్షల ఇంటికి బ్యాంకులు రూ.16 లక్షల రుణం ఇస్తాయి కనుక 20 ఏళ్ల కాలాన్ని నిర్ణయించుకుంటే అప్పుడు కూడా ఈఎంఐ రూ.15,000 అవుతుంది. రుణం పెరిగినప్పటికీ కాల వ్యవధి ఐదేళ్లు పెంచుకున్నారు గనుక ఈఎంఐ మొదటి ఉదాహరణలో మాదిరే ఉంటుంది.  

► ఇక రూ.21.5 లక్షల ఇంటికి బ్యాంకులు రూ.17.2 లక్షల రుణాన్ని ఇస్తాయి. దీనిపైనా రూ.15,000 ఈఎంఐ ఉండాలనుకుంటే ఇంటి రుణ కాల వ్యవధిని 25 ఏళ్లుగా చేసుకుంటే సరిపోతుంది.

ఆదాయంలో ఈఎంఐ 30%
► రూ.26.8 లక్షల ఇంటికి డౌన్‌ పేమెంట్‌ పోను రూ.21.5 లక్షలు రుణంగా లభిస్తుంది. 15 ఏళ్ల టర్మ్‌ పెట్టుకుంటే ఈఎంఐ రూ.22,500 అవుతుంది.
► రూ.30.3 లక్షల ఇంటికి 24.2 లక్షలు రుణంగా తీసుకుంటే టర్మ్‌ను 20 ఏళ్లుగా నిర్ణయించుకున్నా కూడా ఈఎంఐ రూ.22,500 అవుతుంది.
► రూ.32.3 లక్షల ఇంటికి రూ.25.8 లక్షలు రుణంగా లభిస్తుంది. 25 ఏళ్ల టర్మ్‌ను నిర్ణయించుకుంటే ఈఎంఐ 22,500 అవుతుంది.

ఆదాయంలో ఈఎంఐ 40%
► రూ.36 లక్షల ఇంటిపై రూ.28.8 లక్షల రుణానికి గాను, 15 ఏళ్ల టర్మ్‌కు ఈఎంఐ రూ.30,000.
► రూ.40.3 లక్షల ఇంటికి రూ.28.8 లక్షల రుణం లభిస్తుంది. రుణం చెల్లించాల్సిన వ్యవధి 20 ఏళ్లు అయితే అప్పుడూ ఈఎంఐ రూ.30,000 దాటదు.
► ఇక రూ.43 లక్షల ఇంటికి 20 శాతం డౌన్‌ పేమెంట్‌ పోను వచ్చే రుణం రూ.34.4 లక్షలు. కాల వ్యవధి 25 ఏళ్లు అయితే ఈఎంఐ రూ.30,000 అవుతుంది.  

నెలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే తప్ప, ఈఎంఐ 20 శాతానికి మించకుండా ఉంటే దాన్ని సురక్షితంగా భావించొచ్చు.
ఒకవేళ డౌన్‌ పేమెంట్‌ 20 శాతానికి మించి సమకూర్చుకుంటే అప్పుడు కూడా ఈఎంఐ భారం తగ్గుతుంది. నెల వేతనంలో
ఈఎంఐ 40 శాతం వరకు ఉంటే చెల్లింపులు కష్టం కావచ్చు. తప్పదనుకుంటే నెల ఆదాయంలో 30 శాతాన్ని ఈఎంఐగా నిర్ణయించుకోవచ్చు.
కొందరు దంపతులు ఇద్దరూ కలసి ఇంటి రుణం తీసుకుంటుంటారు. ఇరువురు ఆర్జనాపరులైతే అధిక ఈఎంఐ చెల్లించగలరు. అయితే,
రుణ కాల వ్యవధి ముగిసే వరకు ఇద్దరూ ఆర్జనను కొనసాగించాలి. లేదంటే మధ్యలో ఇల్లాలు కుటుంబ అవసరాల కోసం ఉద్యోగాన్ని
 విడిచిపెడితే, అప్పుడు భారీ ఈఎంఐ భారం ఆమె భాగస్వామి ఒక్కరిపైనే పడుతుంది. దీన్ని ముందే ఆలోచించుకోవాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top