మూతపడనున‍్న 950 థియేటర్లు

మూతపడనున‍్న 950 థియేటర్లు


చెన్నై: జీఎస్‌టీ  పన్నుల విధానంపై  అపుడే నిరసనల  సెగలు మొదలయ్యాయి.  జూలై1 నుంచి  అమలవుతున్న పన్నుల నేపథ్యంలో ముఖ్యంగా తమిళనాడు  సినీ పరిశ్రమ అంతటా జీఎస్‌టీ సెగ రగిలింది. 30శాతం స్థానిక అధిక పన్నుబాదుడు,  టికెట్‌  ధరలపై నెలకొన్న గందరగోళం  నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల్‌ యజమానులు  పోరాటానికి దిగనున్నారు.  సుమారు  950 థియేటర్లను బంద్‌ పెట్టేందుకు నిర్ణయించారు. దీంతో 1060 స్క్రీన్లు  జూలై3 సోమవారం  నుంచి మూతపడనున్నాయి.  



జీఎస్టీ పన్నుకు  నిరసనగా థియేటర్ యజమానులు నిరవధిక సమ్మె చేయటానికి నిర్ణయించినట్టు సెంట్రల్‌ అండ్‌ స్టేట్‌ టాక్స్‌పై స్పష్టత లేని కారణంగా తమ నిరసన తెలియచేసేందుకు నిర్ణయించామని తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎస్. శ్రీధర్ చెప్పారు.  మల్టీప్లెక్సులు సహా అనేక థియేటర్లు, సోమవారం నుంచి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బుకింగ్లను నిలిపివేసాయి.


అటు తమిళనాడు నిర్మాతల సంఘం  కూడా దీనిపై స్పందించింది. తమిళనాడులో  వసూలు చేసే వినోద పన్ను జీఎస్‌టీ లో భాగమా, లేక వేరుగా ఉంటుందా అనే అంశంపై కేంద్ర, రాష్ట్రాల నుంచి స్పష్టత కావాలని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌  ప్రెసిడెంట్‌, హీరో విశాల్‌   డిమాండ్‌  చేశారు. ప్రాంతీయ సినిమాని తక్కువ స్లాబ్‌లో ఉంచాలని  కేంద్రాన్ని  కోరుతున్నట్టు  తెలిపారు.


కాగా సినిమా టికెట్లపై  పన్ను రెండు కేటగిరీలుగా  జీఎస్‌టీ కౌన్సిల్‌  నిర‍్ణయించింది.  రూ.100 లోపు టికెట్లపై 18శాతం, రూ.100కు పైన టికెట్లపై 28శాతం  రేట్లను కౌన్సిల్‌ ఫిక్స్‌ చేసింది.  మరోవైపు తమిళనాడు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఎస్పి వేలుమణి, తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్తో పన్నుల సమస్యపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top