నల్లధనం’పై స్విస్‌కు భారత్ హెచ్చరిక | Switzerland not sharing info on bank accounts of Indians: Chidambaram | Sakshi
Sakshi News home page

నల్లధనం’పై స్విస్‌కు భారత్ హెచ్చరిక

Mar 28 2014 12:59 AM | Updated on Jul 11 2019 8:06 PM

స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందించకపోవడంపై కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఘాటుగా స్పందించారు.

 న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందించకపోవడంపై కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఘాటుగా స్పందించారు. తమ విజ్ఞప్తులను పట్టించుకోనందుకు జీ 20 వంటి అంతర్జాతీయ వేదికలపైకి స్విట్జర్లాండ్‌ను గుంజుతామని హెచ్చరించారు. ఈ మేరకు స్విస్ ఆర్థికమంత్రి ఎవెలీన్ విడ్మర్ ష్లుంఫ్‌కు ఈ నెల 13న రెండు పేజీల లేఖ రాశారు.

బ్యాంకు వ్యవహారాల్లో గోప్యతకు చెల్లుచీటీ ఇస్తున్నట్లు 2009 ఏప్రిల్‌లో జీ20 నేతలు ఓ డిక్లరేషన్‌ను ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం(డీటీఏసీ)లోని నిబంధనలను స్విట్జర్లాండ్ గౌరవించలేదని తీవ్ర పదజాలంతో రాసిన లేఖలో చిదంబరం పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన డీటీఏఏ ప్రకారమే భారతీయ పన్ను అధికారులు.. స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని కోరారని చెప్పారు. దొంగిలించిన గణాంకాల ఆధారంగా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉందని పేర్కొంటూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం సమాచారాన్ని అందించకపోవడాన్ని బట్టి ఆ దేశం ఇప్పటికీ ‘బ్యాంకుల గోప్యత’ను పాటిస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. కాగా, 562 కేసులలో భారత్ చేసిన విజ్ఞప్తులను మూసేస్తున్నట్లు ఫిబ్రవరి 20న రాసిన లేఖలో స్విస్ అధికారులు పేర్కొన్నారు.

 త్వరలోనే స్పందిస్తాం: స్విస్ ప్రతినిధి
 చిదంబరం లేఖపై త్వరలోనే స్పందిస్తామని స్విట్జర్లాండ్ సర్కారు గురువారం తెలిపింది. ‘భారత ఆర్థిక మంత్రి లేఖ అందింది. త్వరలోనే మా సమాధానాన్ని అందుకుంటారు’ అని స్విస్ ప్రతినిధి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement