
ఐటీ షేర్లలో అమ్మకాలు
సోమవారం ఉదయం గరిష్టస్థాయిలో మొదలైన స్టాక్ మార్కెట్ ముగింపులో అమ్మకాల ఒత్తిడికి లోనై క్షీణించింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఐటీ షేర్లలో అమ్మకాలు
ముంబై: సోమవారం ఉదయం గరిష్టస్థాయిలో మొదలైన స్టాక్ మార్కెట్ ముగింపులో అమ్మకాల ఒత్తిడికి లోనై క్షీణించింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఐటీ షేర్లలో అమ్మకాలు జరగడంతో స్టాక్ సూచీలు తొలి లాభాల్ని కోల్పోయి, నష్టాల్లో ముగిసాయి. ట్రేడింగ్ తొలిదశలో 75 పాయింట్ల వరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 32,396 పాయింట్ల గరిష్టస్థాయిని చేరింది. చివరకు ముగింపులో 52 పాయింట్ల నష్టంతో 32,274 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ఇదేబాటలో 10,088 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత 9 పాయింట్ల నష్టంతో 10,057 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ పెరగడానికి తగిన చోదకాలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారని, దాంతో మార్కెట్ కన్సాలిడేషన్‌లో పడిపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బ్రిటానియా, ఎవరెడీ, మరికొన్ని కార్పొరేట్ల ఫలితలు సైతం ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చినట్లు విశ్లేషకులు చెప్పారు.
ఇన్ఫోసిస్ 1.75 శాతం డౌన్...
రూపాయి బలపడుతున్న నేపథ్యంలో ప్రధాన ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలు క్షీణించాయి. వీటిలో ఇన్ఫోసిస్ అన్నింటికంటే అధికంగా 1.75 శాతం తగ్గుదలతో రూ. 968 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, లుపిన్, సన్‌ఫార్మా, సిప్లాలు కూడా నష్టపోయాయి. ఇంకా తగ్గిన షేర్లలో ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, మహింద్రా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్‌లు వున్నాయి.
టాటా స్టీల్ 4.2 శాతం అప్...
ఆర్థిక ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో టాటా స్టీల్ 4.26 శాతం పెరిగి 6 సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 600 వద్ద క్లోజయ్యింది. మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాటా స్టీల్ ఫలితాల్ని వెల్లడించింది. జూన్ క్వార్టర్లో నికరలాభం మూడింతలయ్యింది. సెన్సెక్స్–30 షేర్లలో అధికంగా పెరిగిన షేరు ఇదే. ఎస్‌బీఐ, అదాని పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోల్ ఇండియా, మారుతి సుజుకి, బజాజ్ ఆటోలు పెరిగిన షేర్లలో వున్నాయి. ప్రధాన సూచీల్లో వున్న బ్లూచిప్ షేర్లలో అధికభాగం క్షీణించగా, మిడ్‌క్యాప్ షేర్లు జోరును ప్రదర్శించడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతంపైగా పెరిగి ఆల్‌టైమ్ రికార్డుస్థాయి 15,600 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.