
టెక్నాలజీ, స్మార్ట్‌సిటీలపై స్కాట్‌లాండ్ ఆసక్తి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలపై స్కాట్‌లాండ్ ఆసక్తి కనపర్చింది.....
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలపై స్కాట్‌లాండ్ ఆసక్తి కనపర్చింది. ‘గ్లాస్‌గో’ స్మార్ట్ సిటీని నిర్మించిన అనుభవాన్ని దేశంలో అభివృద్ధి చేయనున్న స్మార్ట్‌సిటీలకు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్కాటిష్ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్ సెక్టర్ హెడ్ మార్క్ న్యూలాండ్స్ తెలిపారు.
ముఖ్యంగా టెక్నాలజీ, ఎనలిటిక్స్, బిగ్‌డేటా, సెన్సర్స్‌లతో పాటు డిజిటల్ హెల్త్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో ఉన్న అవకాశాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడుల అవకాశాలపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు స్థానిక కంపెనీలతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్క్ మాట్లాడుతూ టీహబ్, ఐటీ, స్మార్ట్ సిటీలో పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
స్కాట్‌లాండ్‌లో విప్రో, టీసీఎస్, పిరమాళ్ వంటి పది ఇండియన్ కాంపెనీలుండగా, ఇక్కడ 11 కంపెనీలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇవి కాకుండా ఏటా 20 నుంచి 25 కంపెనీలు ఇండియాతో వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇండియా, స్కాట్‌లాండ్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ఏటా 20 శాతం వృద్ధితో ప్రస్తుతం 40 కోట్ల పౌండ్లను దాటిందన్నారు. వ్యాపార అవకాశాలను అందిపుచ్చకోవడానికి ఇండియాలో మూడు చోట్ల స్కాటిష్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.