
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీబ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘హ్యాపీ’ మొబైల్స్ ప్రచారకర్తగా సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ వ్యవహరిస్తారు. 18 నెలలపాటు ఆయన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతారు. గురువారమిక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కంపెనీ సీఎండీ కృష్ణ పవన్ మీడియాతో ఈ విషయం చెప్పారు. మార్చి నాటికి మొత్తం 150 స్టోర్లను తెరుస్తామని వెల్లడించారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల టర్నోవర్‌ను ఆశిస్తున్నాం. జూన్ తొలి వారంలో ఒకేరోజు హైదరాబాద్‌లో 20 ఔట్‌లెట్లను ప్రారంభించనున్నాం’’ అని తెలియజేశారు. వాయిదాల్లో మొబైల్ కొనాలనుకునే ఉద్యోగులు లేదా వ్యాపారులు తమ స్టోర్‌కు ఆధార్ కార్డుతో వస్తే చాలని కంపెనీ ఈడీ కోట సంతోష్ తెలిపారు. వారి ఆదాయం ఆధారంగా ఈఎమ్‌ఐ ఆధారపడి ఉంటుందన్నారు.
త్వరలో ఫౌండేషన్..
సేవా కార్యక్రమాల కోసం త్వరలో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు రామ్ చరణ్ ఈ సందర్భంగా చెప్పారు. ‘హ్యపీ మొబైల్స్ ప్రచార కర్తగా ఉండడం సంతోషంగా ఉంది. ఫౌండేషన్ గురించి ముందే చెప్పకూడదనుకున్నా. ఇదే మంచి సమయమని చెబుతున్నా. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ సేవా కార్యక్రమాలు నిర్మాణాత్మకంగా ఉండాలని ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టాం. ప్రచారకర్తగా వివిధ బ్రాండ్ల ద్వారా వచ్చే ఆదాయంలో 15–20 శాతం ఈ సంస్థకు కేటాయిస్తా’ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే ఆయన తరఫున ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.