రుణాల జారీ ప్రక్రియ మరింత కఠినం

Punjab National Bank Decision - Sakshi

ఎన్‌పీఏలు, మోసాలపై పర్యవేక్షణకు యంత్రాంగం  

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నిర్ణయం

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రూ.13,000 కోట్ల రూపాయల నీరవ్‌మోదీ మోసం నేపథ్యంలో రుణాల జారీ ప్రక్రియను మరింత మెరుగ్గా మార్చాలని నిర్ణయించింది. అలాగే, రుణాలు మొండి బకాయిలుగా మారకుండా, మోసాల నివారణకు గాను పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందు కోసం రుణాల జారీకి ముందు ప్రత్యేక మదింపు, రుణాల జారీ తర్వాత పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నట్టు బ్యాంకు అధికార వర్గాలు తెలిపాయి. రుణాలు తీసుకున్న సంస్థలు ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నిధులను తిరిగి చెల్లింపులకు వినియోగిస్తున్నదీ, లేనిదీ పర్యవేక్షించనున్నట్టు పేర్కొన్నాయి. ఎన్‌పీఏల వసూలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించాయి. తొలుత కొన్ని శాఖల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించి వచ్చే ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని ఆచరణలో పెట్టనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఇదంతా మిషన్‌ పరివర్తన్‌ కార్యక్రమంలో భాగమేనని పేర్కొన్నాయి. కస్టమర్ల సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపించడం, సేవలపై వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు బ్యాంకు ఆటోమేషన్‌ ప్రక్రియను కూడా అమలు చేయాలని నిర్ణయించింది.

2011 నుంచి 41,178 ఎల్‌ఓయూలు 
పీఎన్‌బీ 2011 నుంచి 41,178 లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌ఓయూ)లను జారీ చేయగా, ఇందులో 1,590 నీరవ్‌మోదీ, మెహుల్‌చోక్సీ, వారి భాగస్వాములకు ఇచ్చినవి అని ఆర్థిక శాఖ పార్లమెంటుకు వెల్లడించింది. 2011 నుంచి 2014 మే వరకు పీఎన్‌బీ జారీ చేసిన ఎల్‌వోయూలపై పూర్తి సమాచారం తమ దగ్గర లేదని ఆర్‌బీఐ పేర్కొన్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సభకు తెలిపారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top