మూడు నెలల్లో మారేదేమీ లేదు!

nothing is changing in the next three months - Sakshi

ఉన్న పెట్టుబడులు కాపాడుకుంటే చాలు

కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌కు తొందరొద్దు

నిపుణుల సూచనలు

భారత మార్కెట్లు ఈ ఏడాది యూఎస్‌ మార్కెట్లతో పోలిస్తే పేలవ ప్రదర్శనే జరుపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ మార్కెట్లలో ప్రస్తుతం కొనసాగుతున్న డౌన్‌ట్రెండ్‌ కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రంగాలు ప్రస్తుత త్రైమాసికంలో అధ్వాన్న ఫలితాలు ఇస్తాయని, అందువల్ల హడావుడిగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకుండా, భవిష్యత్‌ను మదింపు చేసి నిర్ణయాలు తీసుకోవాలిన సూచిస్తున్నారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత తొలి రోజుల్లో లేదా వారాల్లో రవాణా రద్దీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోరును పరిగణించకూడదని, క్రమంగా ప్రజలు ఎలా స్పందిస్తారో, ఏ రంగాలు నిలదొక్కుకుంటాయో పరిశీలించాలని చెబుతున్నారు. ఈ ఏడాది కంపెనీల ఫలితాలు ఎలా ఉంటయానేదాని కన్నా సంక్షోభం ముగిసిన తర్వాత సంవత్సరం కంపెనీలు ఎలాంటి ప్రదర్శన చూపుతున్నాయి? వాక్సిన్‌ వస్తుందా? కరోనా సెకండ్‌ వేవ్‌ వస్తుందా? వస్తే ఏ రంగాలు నిలదొక్కుకుంటాయి?.. అనేవి చాలా కీలకమన్నారు. వీటికి స్పష్టమైన సమాధానాలు లభించే కొద్దీ ఈక్విటీల్లో పెట్టుబడులు పెంచుకుంటూ పోవచ్చని సూచించారు. ప్రస్తుతానికి ఉన్న పెట్టుబడులను పరిరక్షించుకుంటూ, కొత్త అవకాశాలను అన్వేషిస్తూ కొనసాగడం బెటరని సలహా ఇస్తున్నారు. వచ్చే మూడునెలల్లో పెద్దగా ఏమీ ర్యాలీల్లాంటి ఉండవని, అందువల్ల ఏదో మిస్సయ్యామనే హడావుడితో పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు. 
యూఎస్‌ vs భారత్‌
యూఎస్‌లో అక్కడ పెద్ద కంపెనీలు కరోనా సంక్షోభానంతర పరిస్థితులతో లబ్ది పొందుతున్నట్లు కనిపిస్తోందని, అందుకే ఆ మార్కెట్లు నిలదొక్కుకున్నాయని, మన దగ్గర అలాంటి స్పష్టమైన సంకేతాలేమీ లేవని వివరించారు. కొంతలో కొంత ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ మినహా ఏ కంపెనీలు సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటున్న సూచలనల్లేవని చెప్పారు. యూఎస్‌లోలాగా భారత్‌లో కార్పొరేట్‌ రంగాన్ని గట్టిగా సమర్ధించే విధానాలకు అవకాశాలు తక్కువంటున్నారు. యూఎస్‌లో ప్రభుత్వం కార్పొరేట్‌ రంగానికి ఇచ్చే మద్దతు మనదగ్గర లభించదన్నారు. పైగా యూఎస్‌లో కంపెనీల వైవిధ్యతకు ఇక్కడ వైవిధ్యతకు తేడాలున్నందున దేశీయ కార్పొరేట్‌ రంగంపై ప్రస్తుతానికి స్పష్టమైన పాజిటివ్‌ భరోసా లేదన్నారు. ప్రస్తుతం భారతీయ ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ అధ్వాన్నంగా ఉన్నా, బుల్‌మార్కెట్‌ ఆరంభమయ్యాక ప్రైవేట్‌ బ్యాంకులు మంచి జోరు చూపించే అవకాశాలున్నట్లు గత చరిత్ర చెబుతోందన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువమంది ఇంటిపట్టున ఉన్నందున కన్జూమర్‌, టెలికం రంగాలకు గిరాకీ పెరిగిందని, పరిస్థితి యధాపూర్వకంగా తయారయ్యాక తిరిగి బ్యాంకుల షేర్లు మంచి రోజులు చూస్తాయని హీలియోస్‌ క్యాపిటల్‌ అభిప్రాయపడింది. చైనా లాక్‌డౌన్‌తో కోల్పోయే ఉద్యోగాలు, జరిగే ఆర్థిక నష్టం కన్నా మనదగ్గర జరిగేది ఎక్కువని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మా, టెలికం, కన్జూమర్‌ రంగాలను ఎంచుకోవచ్చని సూచించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top