
ఆన్‌లైన్ షాపింగ్‌లో వారిదే హవా!
ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్న వారిలో ఆడవారి కంటే మగవారి శాతమే ఎక్కువగా ఉందట.
బెంగళూరు: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్న వారిలో ఆడవారి కంటే మగవారి శాతమే ఎక్కువగా ఉందట. ఈ విషయాన్ని ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా వెల్లడించింది. 2016 ఏడాదికిగానూ జరిగిన ఆన్‌లైన్ అమ్మకాలలో పురుషుల వాటా 60 శాతం ఉండగా, మహిళల వాటా 40 శాతంగా ఉంది. జనవరి 1 నుంచి డిసెంబర్ 15తేదీ వరకు పది కోట్ల మంది జరిపిన ఆన్‌లైన్ కొనుగోళ్ల ప్రకారం ఈ వివరాలను ఫ్లిప్‌కార్డ్ తెలిపింది. ఈ ఏడాది ఫెవరెట్ బ్రాండ్స్ గా శాంసంగ్, లెనోవో, శాన్‌డిస్క్, రెడ్ మి నిలిచాయి.
80 శాతం యూజర్లు కేవలం మొబైల్ యాప్ ద్వారానే ఐటమ్స్ ఆర్డర్ చేశారని సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా 25 నుంచి 34 ఏళ్ల వయసు వారు ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేసే కేటగిరిలో ఉన్నారు. 45 ఏళ్లకు పైబడిన వారు కూడా 15శాతం కొనుగోళ్లలో భాగస్వాములుగా ఉండటం కలిసొచ్చే అంశమని సంస్థ అధికారులు చెప్పారు. మగవారు ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, పర్సనల్ ఆడియో, ఫుట్‌వెర్, లైఫ్ స్టైల్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ కొనుగోలు చేశారు. టైర్ 2, టైర్ 3 నగరాలలో ఆన్ లైన్ విక్రయాలు భారీగా ఊపందుకున్నాయి.