భారత్‌కు రావడం ‘అసాధ్యం’

Mehul Choksi, Nirav Modi rule out early return to India - Sakshi

నా పాస్‌పోర్టు రద్దు చేశారు

అనారోగ్యం కారణంగా  ప్రయాణం చేయలేను

సీబీఐకి గీతాంజలి జెమ్స్‌  ప్రమోటర్‌ చోక్సీ ఈ–మెయిల్‌  

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నిందితుడైన గీతాంజలి జెమ్స్‌ ప్రమోటర్‌ మెహుల్‌ చోక్సీ తాజాగా సీబీఐకి లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విచారణలో సహకరించడానికి తాను భారత్‌ తిరిగి రావడం ‘అసాధ్యం‘ అని ఆయన పేర్కొన్నారు. దీనికి ఇప్పటికే తన పాస్‌పోర్టు రద్దు కావడం ఒక కారణం కాగా.. అనారోగ్య సమస్యల వల్ల ప్రయాణం చేయలేకపోవడం మరో కారణమని చోక్సీ వివరించారు. పీఎన్‌బీని రూ. 12,700 కోట్లకు పైగా మోసం చేసిన వ్యవహారంలో వజ్రాభరణాల వ్యాపారి నీరవ్‌ మోదీ, చోక్సీ విదేశాలకు పరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు రావాలంటూ సీబీఐ పంపిన నోటీసులకు ఏడు పేజీల ఈ–మెయిల్‌లో చోక్సీ సుదీర్ఘ వివరణనిచ్చారు. ‘పాస్‌పోర్ట్‌ చట్టం కింద రీజనల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌ నా పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. దీంతో నేను భారత్‌కి రావడం అసాధ్యంగా మారింది. అంతే తప్ప విచారణకు హాజరయ్యే విషయంలో నేనెలాంటి షరతులు విధించడం లేదని మనవి చేసుకుంటున్నాను‘ అని చోక్సీ ఈ–మెయిల్‌లో పేర్కొన్నారు. 

‘భారత్‌ భద్రతకు ముప్పు’ అనే కారణంతో తన పాస్‌పోర్ట్‌ సస్పెండ్‌ చేస్తున్నట్లు ఫిబ్రవరి 16న తనకు పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌ నుంచి ఈ–మెయిల్‌ వచ్చిందని చోక్సీ వెల్లడించారు. తన వల్ల దేశానికి ఏం ముప్పు ఉందన్నది, పాస్‌పోర్ట్‌ను ఎందుకు రద్దు చేస్తున్నదీ పూర్తి వివరణేదీ అందులో లేదని తెలియజేశారు. మరోవైపు, ‘అనారోగ్య సమస్య వల్ల కూడా నేను ప్రస్తుతం ప్రయాణం చేసే పరిస్థితి లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో గుండె సంబంధ చికిత్స జరిగింది. అయితే, కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున మొత్తం చికిత్స ఒకేసారి పూర్తి చేసే పరిస్థితి లేదు. దీంతో ఈ చికిత్స ప్రక్రియ ఇంకా మిగిలి ఉంది. ఈ కారణాల వల్ల నేను కనీసం నాలుగు నుంచి ఆరు నెలల పాటు ప్రయాణించడానికి లేదు. పైపెచ్చు ఒకవేళ నేనిప్పుడు అరెస్టయిన పక్షంలో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్సకు నిరాకరించి, ప్రభుత్వాసుపత్రిలోనే ట్రీట్‌మెంట్‌ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో నాకు సరైన చికిత్స లభించకపోవచ్చు’’ అని చోక్సీ పేర్కొన్నారు. 

ప్రొవిజనింగ్‌కు ఏడాది వ్యవధి..
రూ. 12,700 కోట్ల రుణ కుంభకోణానికి సంబంధించి ప్రొవిజనింగ్‌ చేసుకునేందుకు పీఎన్‌బీకి రిజర్వ్‌ బ్యాంక్‌ దాదాపు నాలుగు త్రైమాసికాల (ఏడాది) వ్యవధినిచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కేటాయింపులపై రిజర్వ్‌ బ్యాంక్‌ అభిప్రాయం కోరుతూ పీఎన్‌బీ ఇప్పటికే లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధారణంగా లోన్‌ ఫ్రాడ్‌ కేసుల్లో కేటాయింపులపై స్పష్టమైన మార్గనిర్దేశకాలు ఉన్నప్పటికీ.. ఇది అసాధారణ సందర్భం కావడంతో పీఎన్‌బీ ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించాయి. మరోవైపు, పీఎన్‌బీ స్కామ్‌ పరిమాణం మరింతగా పెరగకపోవచ్చని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్‌ చంద్ర గర్గ్‌ పేర్కొన్నారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top