వీక్‌ మార్కెట్లో ఫార్మా షేర్ల ర్యాలీ

Market in volatile mood- Pharma stocks up - Sakshi

ఫార్మా ఇండెక్స్‌ 2 శాతం ప్లస్‌

అరబిందో, బయోకాన్‌, క్యాడిలా అప్‌

ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 95 పాయింట్లు క్షీణించి 37,835కు చేరగా.. నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 11,138 వద్ద ట్రేడవుతోంది. అయితే ఫార్మా రంగానికి డిమాండ్‌ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా ఇండెక్స్‌ 2 శాతం ఎగసింది. మార్కెట్లు వెనకడుగులో ఉన్నప్పటికీ పలు కౌంటర్లు లాభాలతో సందడి చేస్తున్నాయి. కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్ల తయారీ, చైనా స్థానే ఫార్మా ప్రొడక్టులకు విదేశాల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ తదితర అంశాలు ఈ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం..

జోరుగా
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అరబిందో ఫార్మా దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 839కు చేరగా.. బయోకాన్‌ 3 శాతం ఎగసి రూ. 439ను తాకింది. తొలుత రూ. 441 వరకూ పెరిగింది. ఈ బాటలో క్యాడిలా హెల్త్‌కేర్ 2.2 శాతం పుంజుకుని రూ. 373 వద్ద, డాక్టర్‌ రెడ్డీస్‌ 2 శాతం బలపడి రూ. 4115 వద్ద ట్రేడవుతున్నాయి. తొలుత డాక్టర్‌ రెడ్డీస్‌ 4120 వరకూ పురోగమించింది. ఇతర కౌంటర్లలో లుపిన్‌ 2 శాతం లాభంతో రూ. 869 వద్ద, సిప్లా 2 శాతం పెరిగి రూ. 674 వద్ద కదులుతున్నాయి. ఇంట్రాడేలో సిప్లా రూ. 678 వరకూ ఎగసింది. ఇక సన్‌ ఫార్మా సైతం 1.7 శాతం వృద్ధితో రూ. 486 వద్ద ట్రేడవుతోంది. తొలుత  రూ. 488కు పెరిగింది. టొరంట్‌ ఫార్మా 1 శాతం పుంజుకుని రూ. 2387 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2403 వద్ద గరిష్టాన్ని తాకింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top