షేర్ల జోరు : బఫెట్‌ను దాటేసిన జుకర్‌బర్గ్‌

Mark Zuckerberg Becomes Tthird-Richest In The World - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో : ఓ వైపు కేంబ్రిడ్జ్‌ అనలిటికా డేటా స్కాండల్‌, మరోవైపు యూజర్ల ప్రైవసీపై ఆందోళనలు ఫేస్‌బుక్‌ను తీవ్ర ఇరకాటంలో పడేసినప్పటికీ, ఆ కంపెనీ మాత్రం ఏ మాత్రం జంగకుండా శరవేగంగా దూసుకుపోయింది. శుక్రవారం ఫేస్‌బుక్‌ స్టాక్స్‌ ఆల్‌-టైమ్‌ రికార్డు గరిష్టంలో  203.23 డాలర్ల వద్ద ముగిశాయి. అతిపెద్ద స్పోర్ట్స్‌ స్ట్రీమింగ్‌ డీల్‌ను ఫేస్‌బుక్‌ దక్కించుకుంది అని తెలియగానే కంపెనీ స్టాక్స్‌ కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఉరకలు పెట్టారు. ఈ వార్త ఇన్వెస్టర్లకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని  మార్కెట్‌ విశ్లేషకులు చెప్పారు. ఆసియాలోని థాయ్‌ల్యాండ్‌, వియత్నాం, కాంబోడియా, లావోస్‌లో 2019 నుంచి 2022 వరకు జరిగే 380 లైవ్‌ మ్యాచ్‌ల ఎక్స్‌క్లూజివ్‌ రైట్స్‌ను ఫేస్‌బుక్‌ దక్కించుకుందని టైమ్స్‌ రిపోర్టు చేసింది. 

ఈ డీల్‌ విలువ 264 మిలియన్‌ డాలర్లుగా పేర్కొంది. ఫేస్‌బుక్‌ స్టాక్స్‌ ఆల్‌టైమ్‌ గరిష్టంలో ర్యాలీ జరుపడంతో, కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద కూడా అదేమాదిరి దూసుకుపోయింది. వారెన్‌ బఫెట్‌ను దాటేసి, ప్రపంచంలో మూడో అ‍త్యంత ధనికుడిగా నిలిచారు. దీంతో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తర్వాత మూడో స్థానంలో జుకర్‌బర్గ్‌ ఉన్నారు. ప్రస్తుతం జుకవర్‌బర్గ్‌ సంపద 81.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది. డేటా షేరింగ్‌ స్కాండల్‌తో మార్చి నెలలో ఫేస్‌బుక్‌ షేర్లు ఎనిమిది నెలల కనిష్టంలో 152.22 డాలర్ల వద్ద నమోదైన సంగతి తెలిసింది. శుక్రవారం రోజు ఈ స్టాక్‌ 203.23 డాలర్ల వద్ద ముగిసింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top