రుణాలన్నీ ఇక ‘రెపో’తో జత!

Loans Link With Repo Rate Now - Sakshi

అనుసంధానం చేయాల్సిందేనని బ్యాంకులకు ఆర్‌బీఐ స్పష్టీకరణ

అక్టోబర్‌ 1 నుంచీ అమల్లోకి...  

ముంబై: బ్యాంకింగ్‌ రుణ రేట్లు అన్నీ రెపోసహా ద్రవ్య విధాన నిర్ణయ రేట్లకు, ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లకు అనుసంధానం కావాల్సిందేనని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకులకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ బుధవారం ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. మూడు నెలలకు ఒకసారి ఇలాంటి అనుసంధాన నిర్ణయాలు (రిసెట్‌) జరగాలని సర్క్యులర్‌ నిర్దేశించింది. ‘‘వ్యక్తిగత లేదా గృహ, ఆటో అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) ఇచ్చే కొత్త ఫ్లోటింగ్‌ (చర వడ్డీరేటు) రేట్లు ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచీ తప్పనిసరిగా రెపో సహా ద్రవ్య, పరపతి విధాన నిర్ణయ రేట్లకు, ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లకు తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది’’ అని సర్క్యులర్‌ స్పష్టం చేసింది. దీని ప్రకారం, బ్యాంకులు ఇకపై తమ రుణ రేట్లను తప్పనిసరిగా రెపో, మూడు నెలలు లేదా ఆరు నెలల బ్యాండ్లపై లభించే వడ్డీరేట్లకు లేదా ఫైనాన్షియల్‌ బెంచ్‌మార్క్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రచురించే ఇతర బెంచ్‌మార్క్‌ రేట్లకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది.  దీనితో ఆర్‌బీఐ రెపో తగ్గిస్తే, ఆ ప్రయోజనం త్వరితగతిన కస్టమర్‌కు అందుబాటులోనికి రావడానికి వీలు కలుగుతుంది.  బ్యాంకులు తమకు లభించిన రెపో రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడం లేదని, ఆర్థిక మందగమనానికి ఇది ఒక కారణమనీ వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా సర్క్యులర్‌ జారీ అయ్యింది. 

ప్రస్తుత పరిస్థితిపై నిరుత్సాహం...
‘‘ప్రస్తుతం నిధుల సమీకరణ–వ్యయ మిగులు ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) విధానాన్ని బ్యాంకులు అనుసరిస్తున్నాయి. అయితే  వివిధ కారణాల వల్ల ఆర్‌బీఐ విధానపరమైన రేటు నిర్ణయ బదలాయింపు ప్రక్రియ ఎంసీఎల్‌ఆర్‌ మార్గంలో ఆలస్యం అవుతోంది’’అని కూడా ఆర్‌బీఐ తన సర్క్యులర్‌లో తెలిపింది. కాగా ఇప్పటికి దాదాపు 12 బ్యాంకులు తమ రుణ రేటును రెపోను అనుసంధానించడం జరిగింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.4 శాతం) గడచిన నాలుగు ద్వైమాసికాల్లో 1.1 శాతం తగ్గిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ రేటును తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు వరకూ రెపో 0.75 బేసిస్‌ పాయింట్లు తగ్గితే, (అటు తర్వాత 35 బేసిస్‌ పాయింట్లు) బ్యాంకులు మాత్రం 0.30 శాతం మాత్రమే ఈ రేటును కస్టమర్లకు బదలాయించాయని ఆర్‌బీఐ స్వయంగా పేర్కొంది. అయితే రెపోకు బ్యాంకింగ్‌ రుణ రేటు మరింతగా అనుసంధానం కావాల్సి ఉందని కూడా ఆర్‌బీఐ స్పష్టం చేస్తోంది.

రేటు తగ్గించిన ఐసీఐసీఐ
ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం– ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణ రేటును 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను అన్ని మెచ్యూరిటీలపై తగ్గించినట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో ఏప్రిల్‌ నుంచీ బ్యాంక్‌ రుణ రేటు 0.20 శాతం తగ్గించినట్లయ్యింది. కొత్తగా తగ్గించిన రేట్లు సెప్టెంబర్‌ 1 నుంచీ అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ పేర్కొంది. తాజా నిర్ణయం నేపథ్యంలో ఏడాది రేటు 8.55 శాతానికి తగ్గుతుంది. గృహ, ఆటో, వాణిజ్య రుణాలకు ఏడాది రుణ రేటే ప్రామాణికం కావడం గమనార్హం. ఇక ఓవర్‌నైట్‌ ఎంసీఎల్‌ఆర్‌ 8.30 శాతానికి తగ్గుతుంది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రత్యర్థిగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడాది రుణరేటు ప్రస్తుతం 8.60%గా ఉంది. యాక్సిస్‌ బ్యాంక్‌ రేటు 8.55 శాతంగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top