పెట్టుబడులు జియో | KKR to invest Rs 11367 crore in Jio Platforms | Sakshi
Sakshi News home page

పెట్టుబడులు జియో

May 23 2020 1:34 AM | Updated on May 23 2020 1:34 AM

KKR to invest Rs 11367 crore in Jio Platforms - Sakshi

న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ కేకేఆర్‌ 2.32 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ. 11,367 కోట్లు. ఆసియాలో కేకేఆర్‌ చేసిన అత్యంత భారీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇదే. ఆసియా ప్రైవేట్‌ ఈక్విటీ, గ్రోత్‌ టెక్నాలజీ ఫండ్స్‌ ద్వారా కేకేఆర్‌ ఈ మొత్తం ఇన్వెస్ట్‌ చేస్తోంది. ‘ఈ డీల్‌ ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్‌ సంస్థ విలువ రూ. 5.16 లక్షల కోట్లుగా ఉంటుంది‘ అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  

నాలుగు వారాల్లో అయిదో డీల్‌..
జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి గడిచిన నాలుగు వారాల్లో ఇది అయిదో డీల్‌. తొలుత సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ఏప్రిల్‌ 22న రూ. 43,574 కోట్లతో 9.99 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే దిగ్గజ టెక్‌ ఇన్వెస్టరు సిల్వర్‌ లేక్‌ సుమారు రూ. 5,655 కోట్లతో 1.15 శాతం వాటాలు దక్కించుకుంది. ఇక మే 8న అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 11,367 కోట్లు వెచ్చించింది. అటుపైన మే 17న అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ జనరల్‌ అట్లాంటిక్‌ దాదాపు రూ. 6,598.38 కోట్లతో 1.34 శాతం వాటా దక్కించుకుంది. వీటి మొత్తం పెట్టుబడులు రూ. 78,562 కోట్లు అని రిలయన్స్‌ తెలిపింది.

‘అంతర్జాతీయం ఇన్వెస్టింగ్‌ దిగ్గజాల్లో ఒకటైన కేకేఆర్‌.. జియో లో పెట్టుబడులు పెట్టడాన్ని స్వాగతిస్తున్నాను. దేశ ప్రజలందరికీ లబ్ధి చేకూర్చేలా భారతీయ డిజిటల్‌ వ్యవస్థను తీర్చిదిద్దే క్రమంలో కేకేఆర్‌ అనుభవం ఉపయోగపడగలదు.

– రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ

కేకేఆర్‌ కథ ఇదీ..
1976లో ప్రారంభమైన కేకేఆర్‌ సంస్థ టెక్నాలజీ రంగంలో పలు కంపెనీల్లో దాదాపు 30 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. బైట్‌డ్యాన్స్, గోజెక్, బీఎంసీ సాఫ్ట్‌వేర్‌ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. కేకేఆర్‌ టెక్నాలజీ పోర్ట్‌ఫోలియోలో మీడియా, టెలికం, టెక్నాలజీ రంగాలకు చెందిన 20 పైగా కంపెనీలు ఉన్నాయి. 2006 నుంచి భారత్‌లో కూడా కేకేఆర్‌ ఇన్వెస్ట్‌ చేస్తోంది.
దేశ డిజిటల్‌ వ్యవస్థ రూపురేఖల్ని జియో ప్లాట్‌ఫామ్స్‌ మారుస్తున్న తీరు కేవలం కొద్ది కంపెనీలకు మాత్రమే సాధ్యపడుతుంది. భారత్, ఆసియా పసిఫిక్‌ దేశ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలకు తోడ్పాటు  అందిస్తామనేందుకు జియోలో పెట్టుబడులే నిదర్శనం‘  

– కేకేఆర్‌ సహ వ్యవస్థాపకుడు హెన్రీ క్రావిస్‌

Advertisement
 
Advertisement
Advertisement