భారత్‌ అవకాశాల కేంద్రం: కామెరాన్‌  | Sakshi
Sakshi News home page

భారత్‌ అవకాశాల కేంద్రం: కామెరాన్‌ 

Published Fri, Jul 20 2018 1:57 AM

India Opportunities Center: Cameron - Sakshi

కోల్‌కతా: భారత్‌ ఇతర దేశాలకు మించి వేగంగా వృద్ధి చెందుతోందని, ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని బ్రిటన్‌ మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ చెప్పారు. కోల్‌కతాలో ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘మంచి అయినా, చెడు అయినా అవకాశాలపై దృష్టి సారించడం ముఖ్యం. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకోవాలి. నా పదవీ కాలంలో భారత్, బ్రిటన్‌ మధ్య సంబంధాలకు ప్రాధాన్యమిచ్చాం. జి20 దేశాల్లో భారత్‌లోనే బ్రిటన్‌ ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది. టాటాల రూపంలో భారత్‌ నుంచి అతిపెద్ద పెట్టుబడులు అందుకున్న దేశం కూడా మాదే’’ అని కామెరాన్‌ పేర్కొన్నారు. 2010–2016 వరకు కామెరాన్‌ బ్రిటన్‌ ప్రధానిగా పనిచేశారు.

ఈ రోజు మార్కెట్‌ ఎకానమీకి ప్రతికూలతలు ఎదురయ్యాయని, బలవంతుడి రాజకీయాలు ఆవిర్భవించడాన్ని చూస్తున్నామంటూ పరోక్షంగా అమెరికా అధ్యక్షుడి తీరును ప్రస్తావించారు. 7 శాతం వృద్ధి రేటుతో భారత్‌ బలమైన స్థానంలో ఉందన్నారు. స్వేచ్ఛాయుత వాణిజ్యం వ్యర్థమన్న పూర్వ సిద్ధాంతం మాదిరిగా రక్షణాత్మకం, ఒంటరితనం పెరిగిపోతోందని పేర్కొన్నారు. వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదని, దాని రూపు మారిస్తే సరిపోతుందన్నారు. భారత స్టీల్‌పై అమెరికా అధ్యక్షుడు దిగుమతి సుంకాలు విధించడాన్ని తప్పుబట్టారు. భారత ప్రధాని తాను ఎంత బలవంతుడో చూపించాల్సి ఉందన్నారు.   

Advertisement
Advertisement