బేసిక్ సరిపోదు.. అదనం అవసరం!! | In addition to the basic need is not enough..!! | Sakshi
Sakshi News home page

బేసిక్ సరిపోదు.. అదనం అవసరం!!

Published Mon, Sep 19 2016 2:12 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

బేసిక్ సరిపోదు.. అదనం అవసరం!!

వాహన బీమాకు ఎన్నో యాడ్ ఆన్ కవర్లు...
చాలా మందికి కారు కొనాలనే ఆశ ఉంటుంది. కానీ కొనాలంటే లక్షల్లో వ్యవహారం. ఎలాగో తంటాలు పడి అంత మొత్తమూ వెచ్చించి కొనుగోలు చేసిన వాహనానికి... తప్పనిసరి కనక బేసిక్ ఇన్సూరెన్స్ ఎలాగూ తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకు ఎంత మొత్తంలో బీమా తీసుకోవాలనే అంశంపై సరైన స్పష్టత ఉండదు. ఒక వాహనం దెబ్బతిన్నపుడు బేసిక్ ఇన్సూరెన్స్ అనేది అన్నింటికీ వర్తించకపోవచ్చు. ఇలాంటి సమయాల్లోనే మనకు అదనపు ప్లాన్స్ ఉపయుక్తంగా ఉంటాయి.

వీటిని తీసుకోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు మనం పెద్దగా భయపడాల్సిన పని ఉండదు. లేకపోతే జేబుకు పెద్ద చిల్లు పడుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో మోటార్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి పలు ప్రత్యేకమైన యాడ్-ఆన్ కవర్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం...
 
ఇంజిన్ ప్రొటెక్ట్ కవర్: కొత్తగా/మూడేళ్లలోపు కొనుగోలు చేసిన హై ఎండ్ కార్లకు ఈ కవర్‌ను తీసుకోవడం మంచిది. ప్రమాదం జరిగి నప్పుడు వాటిల్లే నష్టాన్ని మాత్రమే కాకుండా ఇంజిన్‌కు సంబంధించి ఏవైనా రిపేర్లు వస్తే వాటినీ కవర్ చేస్తుంది. వర్షాలు వచ్చినప్పుడు నీరు ఎక్కువగా నిల్వ ఉండే పట్టణాలు/లోతట్టు ప్రాంతాల్లోని వాహనదారులు ఇలాంటి కవర్ తీసుకోవడం ఉత్తమం.
 హైడ్రో స్టాటిక్ లాక్ కవర్: ఇంజిన్‌లోకి నీరు ప్రవేశించడం వల్ల తలెత్తే సమస్యల పరిష్కారానికి ఈ కవర్ ఉపయోగపడుతుంది. నీళ్లు/వరదల్లో నడపడం వల్ల ఇంజిన్‌లోకి నీరు వెళ్లే అవకాశాలు ఎక్కువ. అప్పుడు ఇంజిన్ పనిచేయకుండా పోవచ్చు. ఇలాంటి పరిస్థితినే హైడ్రోస్టాటిక్ లాక్‌గా పిలుస్తారు. దీనికి  బేసిక్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తించకపోవచ్చు. ఈ కవర్ అదనంగా తీసుకుంటే బాగుంటుంది.
 
జీరో డిప్రిసియేషన్ కవర్: వాహనదారులకు మరొక ఉపయోగకరమైన కవర్ ఇది. దీని ద్వారా ప్రమాదం జరిగినప్పుడు పాడయిన వాహన భాగాలకు పూర్తిగా పరిహారం పొందొచ్చు. అంటే పాత భాగాలను తీసేసి వాటి స్థానంలో అమర్చే కొత్త వాహన భాగాలకు ఎంత ఖర్చవుతుందో అంతటినీ ఎలాంటి తగ్గుదల లేకుండా తీసుకోవచ్చు. ఈ కవర్ సాధారణంగా కొత్తగా కొనుగోలు చేసిన మోడళ్లకి మాత్రమే వర్తిస్తుంది. కారు కొనుగోలు చేసి ఐదేళ్లు దాటితే ఈ కవర్ పనిచేయదు. జీరో డిప్రిసియేషన్ కవర్ తీసుకోకపోతే వాహన భాగాల మార్పుకు అయ్యే వ్యయంలో దాదాపు 50% భరించాల్సి వస్తుంది. పాలసీ కొనుగోలు/రెన్యూవల్‌లో ఈ కవర్ తీసుకోవచ్చు.
 
రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవర్: మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనం రోడ్డుపై అనుకోకుండా పాడయితే అప్పుడు ఈ కవర్ మనకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ కవర్ తీసుకోవడం వల్ల వాహనం చె డిపోతే సమీపంలోని ప్రాంతాల్లో బీమా కంపెనీ భస ఏర్పాటు చేస్తుంది. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ట్యాక్సీని సమకూరుస్తుంది. మెకానిక్స్ వచ్చి కారును రిపేర్ చేస్తారు. లేకపోతే దగ్గరిలోని గ్యారేజ్ వారితో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు.
 
ఈ విషయం మరువొద్దు: వాహన బీమా పాలసీని తీసుకునే ముందు అన్ని విషయాలను కులంకుషంగా తెలుసుకోవాలి. పాలసీ వేటికి వర్తిస్తుంది, వేటికి వర్తించదు.. అనేదానిపై సమగ్ర అవగాహనకు రా వాలి. ఇంజిన్ కవరేజ్ లేకపోతే యాడ్ ఆన్ కవర్స్ మంచిది. ఇంజిన్ గుండెకాయ లాంటిది. దానికి ఎప్పుడూ సరిపడ కవరేజ్ అవసరం.

Advertisement
 
Advertisement
 
Advertisement