పిల్లల కోసం... రిస్క్‌ లేకుండా!! | ICICI Prudential Childcare | Sakshi
Sakshi News home page

పిల్లల కోసం... రిస్క్‌ లేకుండా!!

Apr 23 2018 1:01 AM | Updated on Apr 23 2018 1:01 AM

ICICI Prudential Childcare - Sakshi

ఈక్విటీ మార్కెట్లు గత రెండు నెలలుగా ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఇక డెట్‌ మార్కెట్లోనూ గడిచిన ఆరు నెలలుగా ఊగిసలాట ధోరణే ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో రిస్క్‌ లేని రాబడులు ఆశించేవారు.. తమ చిన్నారుల చదువు కోసం లేదా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం అవసరమైన నిధిని సమకూర్చుకోవాలని అనుకునే వారు పరిశీలించతగిన పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ చైల్డ్‌కేర్‌ స్డడీ ప్లాన్‌ కూడా ఒకటి.

ఇది దేన్లో ఇన్వెస్ట్‌ చేస్తుందంటే...
ఈ పథకం 75– 80 శాతం పెట్టుబడుల్ని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. అందులోనూ ప్రభుత్వ సెక్యూరిటీలు (జీ–సెక్‌), అధిక రేటింగ్‌ కలిగిన ఏఏఏ కార్పొరేట్‌ బాండ్లలోనే పెట్టుబడి పెడుతుంది. కనుక ఆ మేరకు రిస్క్‌ లేనట్టుగానే భావించాలి. మిగిలిన పెట్టుబడుల్ని... అంటే 20 శాతం వరకు లార్జ్‌క్యాప్‌ షేర్లకు కేటాయిస్తుంటుంది.

దీంతో ఈక్విటీ పెట్టుబడులకు రిస్క్‌ పరిమితంగా ఉంటుంది. ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ చిల్డ్రన్‌ బెనిఫిట్‌ ప్లాన్‌ ఎక్కువగా మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్‌ తీసుకుంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మాత్రం రిస్క్‌ తక్కువగా ఉంచే ఉద్దేశంతో లార్జ్‌క్యాప్‌పై దృష్టి పెడుతుంది.

రాబడులు ఇలా ఉన్నాయ్‌...
చిన్నారులకు ఉద్దేశించిన పథకాల కేటగిరీలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ చైల్డ్‌కేర్‌ స్డడీ ప్లాన్‌ రాబడుల విషయంలో మెరుగ్గా ఉంది. మూడు, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో రాబడుల విషయంలో ఈ విభాగం బెంచ్‌మార్క్‌ రిటర్నుల కంటే 1–5 శాతం ఎక్కువే అందించింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 9 శాతం చొప్పున, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 15 శాతం చొప్పున, పదేళ్ల కాలంలో వార్షికంగా 12 శాతం చొప్పున లాభాలను పంచింది.

అయితే, ఏడాది కాలం పనితీరు విషయంలో మాత్రం ఈ కేటగిరీ కంటే వెనుకబడి ఉండటం గమనార్హం. దీనికి కారణం డెట్‌ పెట్టుబడుల్లో అధిక భాగం 2017లో గడువు తీరిపోవడమే. అలాగే, డెట్‌ మార్కెట్లో ఆటుపోట్ల ప్రభావం కూడా రాబడులపై ఉంది. కానీ, స్వల్పకాలంలో పనితీరు అన్నది అంత ప్రామాణికంగా చూడక్కర్లేదు. ఎందుకంటే దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడి పథకం ఇది.

17 ఏళ్ల కాలంలో దీని పనితీరు చూసుకున్నా ఆకర్షణీయంగానే ఉంది. ఈ పథకం 2001లో ప్రారంభం కాగా, ఏటా 12.4 శాతం చొప్పున రాబడులు అందించింది. సంప్రదాయ ఇన్వెస్టర్లు, దీర్ఘకాల లక్ష్యాలతో ఇన్వెస్ట్‌ చేసే వారు ఈ పథకాన్ని నిశ్చింతగా ఎంచుకోవచ్చు.

చార్జీలు ఇలా ఉంటాయ్‌...
చిన్నారుల విద్యావసరాల కోసం ఉద్దేశించిన పథకం కావడంతో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే చార్జీలుంటాయి. నిర్ణీత కాలం కంటే ముందుగా వైదొలిగితే పెట్టుబడుల విలువపై 3 నుంచి 1 శాతం వరకు ఎగ్జిట్‌ లోడ్‌ ఉంటుంది.

ఏడాదిలోపు 3 శాతం, ఏడాది నుంచి రెండేళ్లలోపు 2 శాతం, రెండు నుంచి మూడేళ్లలోపు ఒక శాతం ఎగ్జిట్‌లోడ్‌ అమలవుతుంది. మూడేళ్లపాటు లేదా చిన్నారికి 18 ఏళ్లు నిండే వరకు ఈ రెండింటిలో ఏది ఆలస్యం అయితే అప్పటి వరకు లాకిన్‌ పీరియడ్‌ వర్తిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement