రిస్క్‌ తగ్గిస్తూ.. డైనమిక్‌ రాబడులు | ICICI Prudential Balanced Mutual Funds Profits | Sakshi
Sakshi News home page

రిస్క్‌ తగ్గిస్తూ.. డైనమిక్‌ రాబడులు

Jul 1 2019 11:07 AM | Updated on Jul 1 2019 11:07 AM

ICICI Prudential Balanced Mutual Funds Profits - Sakshi

బాలన్సుడ్ అడ్వాంటేజ్‌ విభాగంలోని మ్యూచువల్‌ ఫండ్స్‌ (వీటినే డైనమిక్‌ అసెట్‌ అలోకేషన్  ఫండ్స్‌ అని కూడా అంటారు) ఈక్విటీలో, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా డైనమిక్‌గా ఇన్వెస్ట్‌ చేస్తూ రాబడులను ఇచ్చే విధానంలో పనిచేస్తుంటాయి. ఈక్విటీ మార్కెట్లు తక్కువ వ్యాల్యూషన్లకు చేరినప్పుడు అందులో పెట్టుబడులు పెంచుకోవడం, మార్కెట్లు అధిక వ్యాల్యూషన్లకు చేరినప్పుడు ఎక్స్‌పోజర్‌ తగ్గించుకోవడం అనే రిస్క్‌ బాలన్సుడ్ విధానాన్ని అనుసరిస్తుంటాయి. ప్రస్తుతం ఈ విభాగంలో 19 ఫండ్స్‌ ఉన్నాయి. ప్రతీ ఫండ్‌ కూడా తనకుంటూ వ్యా ల్యూషన్  విధానాన్ని అనుసరిస్తోంది. అయితే, ఈక్వి టీ విభాగం పెట్టుబడులను కనీసం 65% కొన సాగించడం వల్ల ఇవి ఈక్విటీ ఫండ్స్‌ కిందకే వస్తాయి. 

రాబడులు..: ఈ విభాగంలో చాలా ఫండ్స్‌ మార్కెట్లు గరిష్టాలకు చేరినప్పుడు ఈక్విటీ డెరివేటివ్‌లోనూ పొజిషన్లను తీసుకోవడం ద్వారా హెడ్జింగ్‌ విధానాలను అనుసరిస్తున్నాయి. ఈక్విటీలకు కేటాయింపులు 65 శాతానికి పైగా చేయడం వల్ల మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే నష్టాలను తగ్గించడం కోసం ఇలా చేస్తుంటాయి. ముఖ్యంగా ఈక్విటీల్లో కొంత పెట్టుబడులు పెట్టాలనుకునే వారు, పరిమిత రిస్క్‌ కోరుకునే వారు ఈ తరహా పథకాలను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో అగ్రగామి పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ కూడా ఒకటి. ఈ పథకం ఏడాదిలో 6.5 శాతం రాబడులను ఇవ్వగా, ఈ విభాగం సగటు రాబడులు 3.3 శాతంగానే ఉన్నాయి. మూడేళ్లలో చూసుకుంటే వార్షిక రాబడులు 9.8 శాతంగాను, ఐదేళ్లలో వార్షికంగా 10 శాతం చొప్పున రాబడులను ఇచ్చాయి. కానీ, ఈ విభాగం  సగటు రాబడులు మూడేళ్లలో 7.8 శాతం, ఐదేళ్లలో 8.1 శాతం చొప్పున ఉన్నాయి. 

ఈ పథకంతోపాటు ఎల్‌అండ్‌టీ డైనమిక్‌ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్, ఇన్వెస్కో ఇండియా డైనమిక్‌ ఈక్విటీ పథకాలు గత ఏడేళ్ల కాలంలో కాంపౌండెడ్‌గా 13–14 శాతం రాబడులను ఇచ్చాయి. ఇదే కాలంలో నిఫ్టీ 50 టీఆర్‌ఐ రాబడులు 11 శాతంగానే ఉన్నాయి. రిస్క్, రాబడుల ఆధారంగా క్రమాన్ని చూస్తే బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ విభాగం... ఈక్విటీ సేవింగ్స్, అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ మధ్య ఉంటుంది. 

పెట్టుబడుల విధానం..: ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి మల్టీక్యాప్‌ విధానాన్ని అనుసరిస్తుంది. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. గత ఐదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఈ పథకం ఈక్విటీల్లో పెట్టుబడులను 65–69% మధ్య నిర్వహిస్తోంది. ఈక్విటీ మార్కెట్లు బాగా పెరిగిన సందర్భాల్లో ఫండ్‌ మేనేజర్‌ డెరివేటివ్‌లో ఈక్విటీ పొజిషన్ల ఆధారంగా షార్ట్‌కు వెళుతుంటారు. 2015 జనవరి, 2018 జనవరిలో ఈ పథకం హెడ్జ్‌డ్‌ పొజిషన్లను 34–36 శాతానికి పెంచుకుంది. ఈక్విటీ నికర పొజిషన్లను 34.36 శాతానికి తగ్గించుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement