ఇప్పటికే దివాలా తీసి ఆర్థికంగా కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న గ్రీస్.. ఈ ఉపద్రవం నుంచి తప్పించుకోవడానికి రుణదాతల కఠిన షరతులకు తలొగ్గింది...
బ్రసెల్స్: ఇప్పటికే దివాలా తీసి ఆర్థికంగా కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న గ్రీస్.. ఈ ఉపద్రవం నుంచి తప్పించుకోవడానికి రుణదాతల కఠిన షరతులకు తలొగ్గింది. కొత్తగా బెయిలవుట్ ప్యాకేజీ కోరుతూ సవివర ప్రతిపాదనలను యూరోజోన్ నేతలకు అందజేసింది. ఇందులో ముఖ్యంగా పెన్షన్ల తగ్గింపు, విలువాధారిత పన్ను(వ్యాట్) పెంపు వంటి కీలక సంస్కరణ చర్యలు ఉన్నాయి.
ప్రతిపాదనల సమర్పణకు గురువారం అర్ధరాత్రిని డెడ్‌లైన్‌గా విధించగా.. దీనికి రెండు గంటల ముందు గ్రీస్ వీటిని యూరో గ్రూప్ ప్రెసిడెంట్ జెరోన్ దిసెల్‌బ్లోయెమ్‌కు అందించింది. కాగా, గ్రీస్ సంస్కరణ ప్రతిపాదనలకు ప్రాథమికంగా యూరో గ్రూప్ వర్గాలు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, నేడు(శనివారం) యూరోజోన్ ఆర్థిక మంత్రుల సమావేశంలో దీనిపై కూలంకషంగా చర్చించనున్నారు. ఆ తర్వాత ఆది వారం జరిగే కీలకమైన 28 దేశాల యూరోపియన్ యూనియన్(ఈయూ) అధినేతల సదస్సులో బెయిలవుట్ ఇవ్వాలా, వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.