గ్లెన్‌మార్క్‌ ఫార్మా- జిందాల్‌ స్టీల్‌.. బోర్లా

Glenmark Pharma- Jindal Steel plunges - Sakshi

యూఎస్‌ కోర్టులో కంపెనీపై కేసు

గ్లెన్‌మార్క్‌ ఫార్మా 4.5% డౌన్‌

ఒమన్‌ ప్లాంట్‌ విక్రయానికి ఓకే

జిందాల్‌ స్టీల్‌ షేరు 5% పతనం

జనరిక్‌ ఔషధాల ధరలను కృత్రిమంగా పెంచిన ఆరోపణలతో యూఎస్‌ జిల్లా కోర్టులో దేశీ హెల్త్‌కేర్‌ కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌పై కేసు దాఖలైంది. కొలెస్టరాల్ చికిత్సతోపాటు ఇతర వ్యాధులకు వినియోగించే జనరిక్‌ ఔషధాల ధరల నిర్ణయంలో అపోటెక్స్‌ కార్ప్‌తో గ్లెన్‌మార్క్‌ చేతులు కలిపిన ఆరోపణలపై కేసు దాఖలైనట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలేనంటూ గ్లెన్‌మార్క్‌ ఫార్మా తాజాగా పేర్కొంది. ఇవి తప్పని నిరూపించే ఆధారాలు తమవద్ద ఉన్నట్లు తెలియజేసింది. 2013-15 మధ్య కాలంలో కొన్ని ఔషధాల ధరలను జనరిక్‌ కంపెనీలు అధికంగా నిర్ణయించిన ఆరోపణలతో ఫిలడెల్ఫియా జిల్లా కోర్టులో అభియోగాలు దాఖలయ్యాయి.  ఈ నేపథ్యంలో గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4.5 శాతం పతనమై రూ. 430 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 424 దిగువకు చేరింది. గత రెండు రోజుల్లో ఈ షేరు 8 శాతం నీరసించింది. జూన్‌ 22న సాధించిన ఏడాది గరిష్టం రూ. 573 నుంచి 25 శాతం క్షీణించింది. 

జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌
ఒమన్‌లోని ప్లాంటును విక్రయించేందుకు పశ్చిమాసియా బ్యాంక్‌ ఆల్పెన్ క్యాపిటల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌(జేఎస్‌పీఎల్‌) తాజాగా పేర్కొంది.  బిలియన్‌ డాలర్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువతో విక్రయ వ్యవహారాన్ని నిర్వహించేందుకు ఆల్పెన్ క్యాపిటల్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలియజేసింది. ఒమన్‌ ప్లాంటు 2.4 ఎంటీ వార్షిక సామర్థ్యంతో ఏర్పాటైంది. రూ. 5600 కోట్లమేర రుణ భారాన్ని కలిగి ఉంది. కీలకంకాని ఆస్తుల విక్రయం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు ఈ సందర్భంగా జేఎస్‌పీఎల్‌ వివరించింది. ఈ నేపథ్యంలో జిందాల్‌ స్టీల్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5.5 శాతం పతనమై రూ. 153 వద్ద ట్రేడవుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top