11 ఏళ్ల కనిష్టానికి జీడీపీ అంచనాలు

GDP Growth For This Year At 5Percent Says Government, Slowest In 11 Years - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికమందగమనంపై  ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధిని ప్రభుత్వం అంచనా వేయడం గమనార్హం.  కేంద్ర గణాంక కార్యాలయం మంగళవారం విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత నామమాత్రపు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని  నమోదు చేయనుంది. గత ఏడాది వృద్ధి రేటు 6.8 శాతంతో పోలిస్తే 5 శాతం వృద్ధికి పరిమితం కానుందని ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. ఇది 11 ఏళ్ల కనిష‍్టం.

జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షిక ఆర్థిక వృద్ధి 4.5 శాతానికి తగ్గింది.  దీంతో ఆర్థికమంత్రి  నిర్మలా సీతారామన్‌ వచ్చే నెలలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో అదనపు ఆర్థిక ఉద్దీపనలకు అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే  వ్యక్తిగత పన్నుల్లో రాయితీలను, గత ఏడాది కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించిన తరువాత మౌలిక సదుపాయాల కోసం ఖర్చులను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు, ఆర్థికవేత్తలు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి క్రమంగా పెరుగుతుందని ప్రైవేట్ ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. తాజా వృద్ధి సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను ,  ప్రభుత్వ వ్యయాన్ని ప్రభావితం చేస్తుందని ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీలో ఆర్థికవేత్త ఎన్.ఆర్. భానుమూర్తి వ్యాఖ్యానించారు.అయితే 2020/21 లో వృద్ధి 6 నుంచి 6.5 శాతానికి చేరుకునే అవకాశం ఉందన్నారు.

2018-19 లో 6.9 శాతం వృద్ధితో పోలిస్తే 2019-20 లో తయారీ   2.0 శాతం పెరుగుతుందని అంచనా వేసినట్లు గణాంకాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు సంవత్సరం 8.7 శాతంతో పోలిస్తే 2019/20 లో నిర్మాణం 3.2 శాతం పెరిగే అవకాశం ఉండగా, వ్యవసాయ రంగం 2.8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అంతకుముందు ఏడాది ఇది 2.9 శాతంగా ఉంది. సవరించిన పూర్తి సంవత్సర వృద్ధి అంచనాలతో పాటు, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి డేటాను గణాంక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 28 న విడుదల చేయనుంది. కాగా  2025 నాటికి భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నంలో వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల కోసం 102 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ప్రణాళికను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top