
ఫ్లిప్‌కార్ట్ లోయల్టీ ప్రొగ్రామ్ (ఫైల్ ఫోటో)
ఆఫర్ల మీద ఆఫర్ల వర్షం కురిపించే దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. మరో సరికొత్త ప్రొగ్రామ్‌కు శ్రీకారం చుట్టబోతుంది.
బెంగళూరు : ఆఫర్ల మీద ఆఫర్ల వర్షం కురిపించే దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. మరో సరికొత్త ప్రొగ్రామ్‌కు శ్రీకారం చుట్టబోతుంది. ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్’పేరుతో కస్టమర్ లోయల్టీ ప్రొగ్రామ్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ప్రొగ్రామ్‌ను స్వాతంత్య్ర దినోత్సవం నుంచే ప్రారంభిస్తోంది. ఈ ప్రొగ్రామ్ కింద కస్టమర్ లోయల్టీ పాయింట్లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేయనుంది. ఈ పాయింట్లను ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫామ్‌పై సేల్ ఆఫర్లు నిర్వహించే సమయంలో ఉచిత డెలివరీకి, ముందస్తు షాపింగ్‌కు, ముందస్తుగా ప్రొడక్ట్‌లు పొందేందుకు ఉపయోగించుకోవచ్చు. దీంతో అమెజాన్ ప్రైమ్ ప్రొగ్రామ్‌కు గట్టి పోటీ ఇవ్వబోతుంది. అయితే ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్’ఎలాంటి ఫీజులు చెల్లించాల్సినవసరం లేదు.
ప్రతి ఆర్డర్‌పై కూడా ‘ప్లస్ కాయిన్ల’ పేరుతో కస్టమర్లకు డిజిటల్ కరెన్సీని కూడా ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. వీటిని తన సొంత ప్లాట్‌ఫామ్‌పై లేదా హాట్‌స్టార్, బుక్‌మైషో, జోమాటో, మేక్‌మై-ట్రిప్, కేఫ్ కాఫీ డే లాంటి పార్టనర్ ప్లాట్‌ఫామ్‌లలో ఉపయోగించుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఇలా లోయల్టీ ప్రొగ్రామ్‌ను ఆఫర్ చేయడం ఇది రెండో సారి. తొలిసారి 2014లో ‘ఫ్లిప్‌కార్ట్ ఫస్ట్’ పేరుతో ఈ లోయల్టీ ప్రొగ్రామ్‌ను ఆఫర్ చేసింది. ఈ ప్రొగ్రామ్‌కు ఓ తుది రూపం ఇచ్చేందుకు ఇటీవల కాలంలో కంపెనీ కస్టమర్ రీసెర్చ్ చేపట్టిందని ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మార్కెటింగ్, యాడ్స్ హెడ్ సౌమ్యాన్ బిస్వాస్ చెప్పారు. ఈ రీసెర్చ్, డేటా అనాలసిస్ ప్రకారమే ఈ ప్రొగ్రామ్‌ను అభివృద్ధి చేసినట్టు పేర్కొన్నారు. ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే ప్రొగ్రామ్ అని బిస్వాస్ అన్నారు.
తమ 100 మిలియన్ కస్టమర్లలో ఎవరైనా ఈ కాయిన్లను పొందవచ్చని, ప్రయోజనాలను, రివార్డులను అన్‌బ్లాక్ చేసుకోవడం ప్రారంభించుకోవచ్చని తెలిపారు. అయితే లోయల్టీ పాయింట్లను ఎలా పొందాలి? ప్లస్ కాయిన్ల విలువ ఎంత ఉంటుంది? అనే వివరాలను ఫ్లిప్‌కార్ట్ బహిర్గతం చేయలేదు. గత నెలలోనే ఫ్లిప్‌కార్ట్ ఈ లోయల్టీ ప్రొగ్రామ్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. దీనికోసం వచ్చే మూడేళ్లలో 173 మిలియన్ డాలర్లను కూడా వెచ్చించబోతుంది. కాగ, రిటైల్ స్పేస్‌లో లోయల్టీ ప్రొగ్రామ్‌లు మంచి పేరును సంపాదించుకుంటున్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి పలు కంపెనీలు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రొగ్రామ్‌ను కస్టమర్లకు ఆఫర్ చేయడంలో ఫ్లిప్‌కార్ట్ కాస్త ఆలస్యం చేసిందని టెక్నోపాక్ చైర్మన్ అరవింద్ సింఘల్ చెప్పారు.