డిజిటల్‌ పేమెంట్లు : ఆర్‌బీఐ ప్రమాద హెచ్చరికలు

Few Big Players Dominating Digital Payments Is A Risk, Warns RBI - Sakshi

న్యూఢిల్లీ : డిజిటల్‌ పేమెంట్లు... పెద్ద నోట్ల రద్దు తర్వాత అతివేగంగా విస్తరించిన వ్యవస్థ. ప్రస్తుతం నగదు రహిత చెల్లింపులకు డిజిటల్‌ పేమెంట్లు ఎంతో సహకరిస్తున్నాయి. ఈ పేమెంట్లను ప్రస్తుతం కొన్ని దిగ్గజ కంపెనీలు మాత్రమే తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. ఓ కస్టమర్‌ డిజిటల్‌ పేమెంట్‌ను చేయాలంటే ఆ సంస్థను ఆశ్రయించాలే తప్ప, మరో మార్గం లేకుండా చేస్తున్నాయి. వీటిలో పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్‌ పే, గూగుల్‌ తేజ్‌ ఉండగా.. తాజాగా ఫేస్‌బుక్‌ కూడా చేరిపోయింది. అయితే డిజిటల్‌ పేమెంట్లు కొద్ది మంది ప్లేయర్ల చేతిలోనే ఉండటం అత్యంత ప్రమాదకరమని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా హెచ్చరించింది. దేశీయ డిజిటల్‌ పేమెంట్ల రంగాన్ని కొన్ని దిగ్గజ కంపెనీలే తమ ఆధిపత్యంలో పెట్టుకోవడం సరియైనది కాదని అంటోంది. ‘స్టేట్‌మెంట్‌ ఆన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేటరీ పాలసీస్‌’ ను విడుదల చేసిన ఆర్‌బీఐ, రిటైల్‌ పేమెంట్ల రంగంలో నెలకొన్న ప్రమాదంపై హెచ్చరికలు జారీచేసింది.  

ఆర్థిక స్థిరత్వ దృక్పథం నుంచి రిటైల్‌ చెల్లింపుల సిస్టమ్‌లో ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొంది. ఈ సిస్టమ్‌లో మరింత మంది ప్లేయర్లు, కంపెనీలు పాల్గొనాలనే ప్రోత్సహించనున్నామని ఆర్‌బీఐ తెలిపింది. ప్యాన్‌ ఇండియా పేమెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌ను ప్రమోట్‌ చేయాలని, దీంతో ఈ రంగంలో పోటీ పెరిగి, సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్‌ పేమెంట్ల వల్ల ఎక్కువగా లాభపడింది పేటీఎంనే. ఈ రంగంలోకి తాజాగా ఫేస్‌బుక్‌ కూడా ఎంట్రీ ఇస్తోంది. తన వాట్సాప్‌ ప్లాట్‌ఫామ్‌పై పేమెంట్‌ సర్వీసులను యాడ్‌ చేసి, ఈ రంగంలోకి ఫేస్‌బుక్‌ ప్రవేశిస్తోంది. గూగుల్‌, అమెజాన్‌, పేటీఎం మొబిక్విక్‌, ఫోన్‌పేలు ఇప్పటికే భారత్‌లో దిగ్గజ డిజిటల్‌ పేమెంట్ల కంపెనీలుగా ఉన్నాయి. దీంతో కొద్ది మంది చేతులోనే ఉన్న డిజిటల్ పేమెంట్ల పరిశ్రమను ప్రస్తుతం ఆర్‌బీఐ ఎంతో నిశితంగా పరిశీలిస్తోంది. అందరి యూజర్ల డేటాను కూడా భారత్‌లోని సర్వర్లలోనే స్టోర్‌ చేయాలని ఆర్‌బీఐ ఈ కంపెనీలను ఆదేశించింది. ఆర్‌బీఐ ఆదేశాలను స్థానిక కంపెనీలు స్వాగతించగా.. గ్లోబల్‌ టెక్నాలజీ కంపెనీలకు మాత్రం  ఆర్‌బీఐ ఆదేశాలు మింగుడు పడటం లేదు.     

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top