ఫేస్‌బుక్‌, కేంబ్రిడ్జ్‌ అనలిటికాలకు మరోసారి నోటీసులు

Facebook, Cambridge Analytica Slapped With 2nd Notice - Sakshi

డేటా చోరి విషయంలో అమెరికా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు, బ్రిటిష్‌ రాజకీయ విశ్లేషక సంస్థ కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. గతంలో పంపిన నోటీసులకు ఈ సంస్థలు ఇచ్చిన సమాధానాలు సరియైన విధంగా లేకపోవడంతో, ప్రభుత్వం తిరిగి మరోసారి నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం పంపిన తొలి నోటీసుకు కేంబ్రిడ్జ్ అనలిటికా చెప్పీ చెప్పనట్టు, తప్పించుకునే తీరులో స్పందన తెలియజేసింది. దీంతో మరిన్ని ప్రశ్నలను కేంద్రం సంధించింది. ఈ అదనపు ప్రశ్నలకు వచ్చే నెల 10వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కేంద్రం ఆ సంస్థలను ఆదేశించింది. 

అయితే ఈ సారి పంపిన నోటీసుల్లో భారత్‌కు సంబంధించి ఏ తరహా సమాచారం సేకరించారు? సంబంధిత డేటాను కొట్టేయడానికి వాడిన టూల్స్‌ ఏంటని ప్రశ్నించింది. అటు ఫేస్ బుక్ స్పందన సైతం లోపాలమయంగానే ఉండడంతో మరిన్ని వివరణలు కోరింది. ఫేస్‌బుక్‌ ఈ విషయంపై క్షమాపణ కోరింది. అంతేకాక భారత్‌కు చెందిన 5.62 లక్షల యూజర్ల సమాచారం డేటా చోరి బారిని పడినట్టు పేర్కొంది. భారత్‌ చట్టాలు, గోప్యత నిబంధనలు ఉల్లంఘిస్తూ.. భారత్‌లో కార్యకలాపాలు సాగించే విదేశీ ఐటీ కంపెనీలకు ఇది స్ట్రాంగ్‌ మెసేజ్‌ లాంటిదని ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. భవిష్యత్తులో యూజర్ల డేటా దుర్వినియోగం పాలవకుండా ఉండేందుకు ఎలాంటి ప్రణాళికలను చేపడుతుందో తెలుపాలని కూడా ఫేస్‌బుక్‌ ప్రభుత్వం ఆదేశించింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top