కోక–కోలా చేతికి కోస్టా కాఫీ బ్రాండ్‌

Coca-Cola to acquire Costa Coffee for $5.1bn - Sakshi

డీల్‌ విలువ 510 కోట్ల డాలర్లు

వచ్చే ఏడాది జూన్‌కల్లా పూర్తి

లండన్‌: శీతల పానీయాల దిగ్గజ సంస్థ, కోక–కోలా  కోస్టా కాఫీ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. ఇంగ్లాం డ్‌కు చెందిన విట్‌బ్రెడ్‌ కంపెనీ నుంచి ఈ కోస్టా కాఫీ బ్రాండ్‌ను 510 కోట్ల డాలర్లు(390 కోట్ల పౌండ్లు)కు  కొనుగోలు చేశామని కోక–కోలా కంపెనీ తెలిపింది. బ్రిటన్‌లో అతి పెద్ద కాఫీ కంపెనీగా కోస్టా కాఫీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంగ్లాండ్‌లో 2,400కు పైగా, 30 దేశాల్లో 1,400 వరకూ కాఫీ షాప్స్‌ను నడుపుతోంది. మార్చితో ముగిసిన ఏడాదికి  కంపెనీ 129 కోట్ల పౌండ్ల అమ్మకాలపై 12.3 కోట్ల పౌండ్ల లాభాన్ని సాధించింది.

కోకకోలాకు పోటీ కష్టాలు: ఈ డీల్‌ వచ్చే ఏడాది జూన్‌కల్లా పూర్తవుతుందని అంచనా. ఈ బ్రాండ్‌ కొనుగోలుతో కోకకోలాకు కష్టాలు తప్పవని నిపుణులంటున్నారు. కొత్తగా కాఫీ రంగంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, స్టార్‌బక్స్‌ వంటి ఇతర బ్రాండ్ల నుంచి గట్టి పోటీని కోకకోలా ఎదుర్కొనున్నది. కాఫీ వంటి వేడి పానీయాల సెగ్మెంట్లో తమకు అంతర్జాతీయ బ్రాండ్‌ ఏదీ ఇప్పటివరకూ లేదని కోక కోలా ప్రెసిడెంట్, సీఈఓ జేమ్స్‌ చెప్పారు.

విట్‌బ్రెడ్‌కు భారీ లాభాలు..
కోస్టా కాఫీ బ్రాండ్‌ అమ్మకం వల్ల విట్‌బ్రెడ్‌ సంస్థకు భారీగా లాభాలు రానున్నాయి. 1995లో కోస్టా కాఫీ బ్రాండ్‌ను కేవలం 1.9 కోట్ల పౌండ్లకు మాత్రమే కొనుగోలు చేసింది. ఇప్పుడు ఏకంగా 390 కోట్ల పౌండ్లకు విక్రయిస్తోంది. అప్పుడు ఈ బ్రాండ్‌కు 39 షాప్‌లు ఉన్నాయి.

అప్పటి నుంచి కోస్టా కాఫీ బ్రాండ్‌ విస్తరణ కోసం ఈ కంపెనీ భారీగానే పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఈ వ్యాపారంలో వచ్చిన లాభాలను బడ్జెట్‌ చెయిన్‌ హోటల్‌  ప్రీమియర్‌ ఇన్‌ విస్తరణ కోసం వినియోగించింది. తాము కాదనకుండా చెప్పలేని ఆఫర్‌ను కోకకోలా ఇచ్చిందని విట్‌బ్రెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అలిసన్‌ బ్రిట్టెయిన్‌ చెప్పారు. అందుకే ఈ డీల్‌ను డైరెక్టర్ల బోర్డ్‌ ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. కాగా ఈ ఆఫర్‌ కారణంగా విట్‌బ్రెడ్‌ షేర్‌ 16 శాతం ఎగసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top