వాహన సర్వీసింగ్‌... ఇంటికే!!

Booking for vehicle servicing made easy in Hyderabad - Sakshi

డూయర్స్‌తో ఇంటి వద్దే బైక్, కార్‌ సేవలు

200 వర్క్‌షాప్‌లు; 150 టెక్నీషియన్స్‌తో ఒప్పందం

6 నెలల్లో విజయవాడ,వైజాగ్‌లో సేవలు షురూ

‘సాక్షి’తో ఫౌండర్‌ మహేశ్‌ షేట్కర్‌ వెల్లడి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మెట్రో నగరాల్లో కారు లేదా బైక్‌ సర్వీసింగ్‌ అంటే పెద్ద ప్రహసనం. ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీలో ఎలాగైతే ఆర్డర్‌ చేసుకుంటున్నామో.. అంతే సులువుగా వాహన సర్వీసింగ్‌ సేవలందిస్తే? జస్ట్‌.. సింపుల్‌! ఆర్డర్‌ బుక్‌ చేసిన 20 నిమిషాల్లో ఇంటి వద్దకే టెక్నీషియన్‌ వచ్చి... బైక్, కార్‌ సర్వీసింగ్‌ చేసేస్తారు. ఇదే డూయర్స్‌ పని. మరిన్ని వివరాలు కంపెనీ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ మహేశ్‌ షేట్కర్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.   ‘‘బెంగళూరు, పుణే, హైదరాబాద్‌లో సేవలందిస్తున్నాం. వర్క్‌షాప్స్, టెక్నీషియన్స్, వాహన విడిభాగాల కోసం స్థానిక సర్వీసింగ్‌ సెంటర్లతో ఒప్పందం చేసుకున్నాం. 45 రోజులు వర్క్‌షాప్‌ నిర్వహించి, డిమాండ్‌ను పరిశీలించాక టెక్నీషియన్స్‌కు శిక్షణ ఇచ్చి డూయర్స్‌లో నమోదు చేస్తాం. ప్రస్తుతానికి మూడు నగరాల్లో కలిపి 200 వర్క్‌షాప్స్, 500 మంది టెక్నీషియన్స్‌ ఉన్నారు. వచ్చే ఏడాది కాలంలో వీటి సంఖ్యను 500కు చేరుస్తాం. ఆర్డర్‌ బుక్‌ కాగానే దగ్గర్లోని వర్క్‌షాప్‌కు అలర్ట్‌ వెళుతుంది. 20–40 నిమిషాల్లో టెక్నీషియన్‌ ఇంటికి చేరుకొని.. మైనర్‌ సర్వీసింగ్‌ అయితే అక్కడే పూర్తి చేస్తాడు. మేజర్‌ అయితే వర్క్‌షాప్‌కు తీసుకెళ్లి వాహన రిపోర్ట్, ఇన్వాయిస్‌ను కస్టమర్‌కు పంపిస్తాడు. ఓకే అయితే సర్వీసింగ్‌ ప్రారంభమవుతుంది. 

నెలకు 8–10 వేల ఆర్డర్లు... 
హోమ్‌ సర్వీసింగ్‌తో పాటూ బ్రేక్‌ డౌన్, టైర్ల మార్పు, పెయింటింగ్, రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌ వంటి సేవలనూ అందిస్తున్నాం. ప్రస్తుతానికి మూడు నగరాల్లో కలిపి నెలకు 8–10 వేల ఆర్డర్లు వస్తున్నాయి. వీటిలో 60 శాతం బైక్, 40 శాతం కార్‌ సర్వీసింగ్‌ ఆర్డర్లు. బైక్‌కు 4 గంటలు, కార్‌కు 7 గంటల సమయం పడుతుంది. ధరలు రూ.150 నుంచి లక్షన్నర వరకున్నాయి. ఆథరైజ్డ్‌ సర్వీసింగ్‌ సెంటర్‌తో పోలిస్తే 20–45 శాతం వరకు ధరలు తక్కువగా ఉంటాయి. ప్రతి నెలా ఆర్డర్లు, ఆదాయంలో 40% వృద్ధిని నమోదు చేస్తున్నాం. 

6 నెలల్లో విజయవాడ, వైజాగ్‌లో..  
ప్రస్తుతం హైదరాబాద్‌లో 25 వర్క్‌షాప్స్, 150 మంది టెక్నీషియన్స్‌ ఉన్నారు. నెలకు వెయ్యి ఆర్డర్లు వస్తున్నాయి. 3 నెలల్లో చెన్నై, ముంబై, ఢిల్లీ, గుర్గావ్‌ నగరాలకు విస్తరించనున్నాం. 6 నెలల్లో 50 వర్క్‌షాప్స్‌తో విజయవాడ, విశాఖపట్నంలో సేవలు ప్రారంభిస్తాం. ప్రస్తుతం మా కంపెనీలో 25 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో ఈ సంఖ్యను మూడింతలు చేస్తాం. ఏడాదిలో నిధుల సమీకరణ పూర్తి చేసి.. ఇంటి వద్దకే పెట్రోల్, డీజిల్‌ సరఫరా సేవలను ప్రారంభిస్తాం’’ అని’ మహేశ్‌ వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top