నేడు, రేపు.. బ్యాంకులు బంద్‌!! | Bank unions to go on 48-hour strike from tomorrow | Sakshi
Sakshi News home page

నేడు, రేపు.. బ్యాంకులు బంద్‌!!

May 30 2018 1:28 AM | Updated on May 30 2018 2:17 PM

Bank unions to go on 48-hour strike from tomorrow - Sakshi

న్యూఢిల్లీ: మెరుగైన వేతనాల పెంపు డిమాండ్‌తో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో బుధ, గురువారాలు రెండు రోజుల పాటు బ్యాంకింగ్‌ సేవలకు విఘాతం కలగనుంది. వేతన సవరణపై చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ (సీఎల్‌సీ) ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో సమ్మె అనివార్యమైనట్లు ఆలిండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీవోసీ) తెలియజేసింది. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌లోని (యూఎఫ్‌బీయూ) 9 అసోసియేషన్స్‌కి చెందిన 10 లక్షల మంది పైచిలుకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.

మే 5న జరిగిన సమావేశంలో ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) రెండు శాతం వేతనాల పెంపును ప్రతిపాదించగా.. యూనియన్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ‘మేము లేవనెత్తిన అంశాలన్నీ ఆమోదయోగ్యంగానే ఉన్నాయని చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ అభిప్రాయపడ్డారు. సానుకూలంగా స్పందించాలని ఐబీఏకి సూచించారు. నిర్వహణ లాభాలు మెరుగుపడటం, సిబ్బంది వ్యయాలు తగ్గడం, పెరుగుతున్న వ్యాపార పరిమాణం తదితర గణాంకాలన్నీ కూడా యూఎఫ్‌బీయూ లీడర్లు వివరించారు.

ఇవన్నీ పరిగణించిన మీదట కష్టించి పనిచేసే అధికారులు, సిబ్బందికి లాభాల ఆధారంగా కాకుండా తగిన వేతనాల పెంపు ఉండాలని సీఎల్‌సీ సూచించారు. అయితే, ఐబీఏ మరో కొత్త ఆఫర్‌ ఏదీ చేయలేదు. చర్చలు కొనసాగిస్తామని మాత్రం పేర్కొంది‘ ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు పాత తరం ప్రైవేట్‌ బ్యాంకులు, విదేశీ బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ వర్కర్స్‌ (ఎన్‌వోబీడబ్ల్యూ) వైస్‌ ప్రెసిడెంట్‌ అశ్విని రాణా తెలిపారు.

స్తంభించనున్న బ్యాంకింగ్‌ లావాదేవీలు..
ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖల్లో విత్‌డ్రాయల్, డిపాజిట్‌ లావాదేవీలు స్తంభించనున్నాయి. ఇప్పటికే ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మొదలైన బ్యాంకులు.. సమ్మె గురించి ఖాతాదారులకు సమాచారమిచ్చాయి. వీలైనంత వరకూ డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు వినియోగించుకోవాలని కోరాయి.

అయితే, చెక్కుల క్లియరెన్స్‌లో కొంత జాప్యం మినహా ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కోటక్‌ మహీంద్రా వంటి ప్రైవేట్‌ బ్యాంకుల కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగనున్నాయి.  దేశీయంగా ప్రభుత్వ రంగంలో 21 బ్యాంకులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మొత్తం బ్యాంకింగ్‌ వ్యాపార పరిమాణంలో వీటి వాటా 75 శాతం మేర ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement