
మషేష్ మూర్తి
ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్, సీడ్‌ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ మూర్తిని శుక్రవారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ మహిళను సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేసినట్టు ఈయనపై కేసు నమోదైంది. మూర్తి డిజిటల్ ఏజెన్సీ ఫిన్‌స్టార్మ్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వ్యవస్థాపకుడు కూడా. 2017లో కేంద్ర మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) వద్ద మహిళ తన ఫిర్యాదును నమోదుచేసింది. ఎన్‌సీడబ్ల్యూ ఆదేశాలతో 2017 డిసెంబర్ 30న ఆయనపై కేసు నమోదైంది. అనంతరం ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం మషేష్ మూర్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలోని సంబంధిత ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ 354(డీ), 509 కింద ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు ఖార్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ రామ్‌చంద్ర జాదవ్ తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈ ఇన్వెస్టర్ అభ్యంతరకరమైన, లైంగిక వ్యాఖ్యలు, అసభ్య సంకేతాలతో మహిళలను వేధిస్తున్నట్టు ఎన్‌సీడబ్ల్యూ, మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకు లేఖ రాసింది. కొన్ని పోస్టులకు మషేష్ క్షమాపణ కూడా చెప్పారు. కానీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, విచారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌సీడబ్ల్యూ, డీజీపీని కోరింది. ఈ మేరకు ఆయన్ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.