అమెజాన్‌ చేతికి మోర్‌!!

Amazon, Samara buy Aditya Birla group More retail chain    - Sakshi

రూ. 4,200 కోట్ల డీల్‌

ఆఫ్‌లైన్‌ రిటైల్‌లోకి మరింతగా విస్తరణ 

సమర ఫండ్‌తో కలిసి కొనుగోలు 

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన మోర్‌ సూపర్‌ మార్కెట్‌ చెయిన్‌ (ఆదిత్య బిర్లా రిటైల్‌ –ఏబీఆర్‌ఎల్‌) ఇక అంతర్జాతీయ రిటైలింగ్‌ దిగ్గజం అమెజాన్‌ చేతికి చేరనుంది. ఇందుకు సంబంధించి సమర ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో మోర్‌ బ్రాండ్‌ మాతృసంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్‌  ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 4,200 కోట్లుగా ఉంటుందని అంచనా. ఆదిత్య బిర్లా రిటైల్‌ (ఏబీఆర్‌ఎల్‌)కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోర్‌ బ్రాండ్‌ కింద 509 మోర్‌ బ్రాండెడ్‌ సూపర్‌మార్కెట్లు, 20 హైపర్‌మార్కెట్లు ఉన్నాయి. సగభాగం పైగా స్టోర్స్‌ దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోనే ఉన్నాయి.  ఫ్యూచర్‌ గ్రూప్, రిలయన్స్‌ రిటైల్, డీమార్ట్‌ తర్వాత మోర్‌ నాలుగో స్థానంలో ఉంది. గతేడాది ఏప్రిల్‌ నాటికి ఏబీఆర్‌ఎల్‌ నికర రుణం రూ. 6,456 కోట్లుగా ఉంది. 2016 నుంచి స్టోర్స్‌ సంఖ్య పెరుగుతూ వస్తున్నప్పటికీ.. కంపెనీ వ్యయాలను నియంత్రించుకుంటూ వస్తోంది. నిర్వహణపరమైన నష్టాల నేపథ్యంలో స్టోర్స్‌ పరిమాణం, అద్దెలు తగ్గించుకుంటోంది. గతంలో త్రినేత్ర సూపర్‌మార్కెట్‌గా తెలుగురాష్ట్రాల్లో పేరొందిన బ్రాండ్‌నే ఆదిత్య బిర్లా గ్రూప్‌ 2007లో కొనుగోలు చేసి మోర్‌గా పేరు మార్చింది.  

ఒప్పందం ఇలా.. 
ఏబీఆర్‌ఎల్‌లో కుమార మంగళం బిర్లా.. ఆయన కుటుంబానికి చెందిన ఆర్‌కేఎన్‌ రిటైల్‌కి 62 శాతం, కనిష్ట ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి 37 శాతం వాటాలు ఉన్నాయి. రెండు హోల్డింగ్‌ కంపెనీలు .. ఏబీఆర్‌ఎల్‌లోని తమ తమ వాటాలను సమర ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌కి చెందిన విట్‌జీగ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌కు విక్రయించనున్నట్లు ఆర్‌కేఎన్‌ రిటైల్‌ సంస్థ వెల్లడించింది. వాస్తవానికి సమర ఈ ఏడాది జూన్‌లోనే ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గోల్డ్‌మన్‌ శాక్స్, అమెజాన్‌ని కూడా ఇందులో భాగం చేసింది. ఈ డీల్‌ కోసం మూడు సంస్థలు ప్రత్యేక సంస్థను లేదా స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇందులో వ్యూహాత్మక భాగస్వామిగా అమెజాన్‌ 49 శాతం వాటాలు దక్కించుకోనుంది. ఏబీఆర్‌ఎల్‌లో వాటాలు కొంటున్న విట్‌జీగ్‌ అడ్వైజరీలో కూడా అమెజాన్‌కు వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా మొత్తం మీద చూస్తే అమెజాన్‌ చేతికి మోర్‌ చేరినట్లు కానుంది.   భారత విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ చట్టాల ప్రకారం మోర్‌ లాంటి మల్టీ బ్రాండ్‌ రిటైలర్స్‌లో విదేశీ కంపెనీలు 49% వరకే ఇన్వెస్ట్‌ చేయడానికి ఉంది. దీంతో అవి దేశీ సంస్థలతో జట్టు కట్టి ఇలాంటి కొనుగోళ్లు జరుపుతున్నాయి.  ఇటీవలే ఇదే తరహా డీల్‌లో టీపీజీ, శ్రీరామ్‌ గ్రూప్‌ల నుంచి విశాల్‌ రిటైల్‌ను రూ.5,000 కోట్లతో కొనుగోలు చేసేందుకు స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ పార్ట్‌నర్స్‌ గ్రూప్‌.. దేశీ ఫండ్‌ హౌస్‌ కేదార క్యాపిటల్‌తో జట్టు కట్టింది.

1.1 ట్రిలియన్‌  డాలర్ల మార్కెట్‌.. 
ఇప్పటిదాకా ఆన్‌లైన్‌ వ్యాపారానికే పరిమితమైన అమెజాన్‌..ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌పైనా దృష్టి పెడుతోంది. భారత రిటైల్‌ మార్కెట్‌ ప్రస్తుతం 672 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. 2020 నాటికల్లా 1.1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ రిటైల్‌ దిగ్గజాలు భారత్‌పై దృష్టి సారిస్తున్నాయి. ఇటీవలే దేశీ ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాలను అమెరికా రిటైల్‌ సంస్థ వాల్‌మార్ట్‌ 16.7 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. దీని కోసం అమెజాన్‌ కూడా పోటీపడినప్పటికీ కుదరలేదు. అయితే, గతేడాది షాపర్స్‌ స్టాప్‌లో రూ. 179 కోట్లు పెట్టి 5% వాటాలు కొనుగోలు చేసింది.ఇక ఇప్పుడు మోర్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేసిన పక్షంలో దేశీ రిటైల్‌ రంగంలో అమెజాన్‌కి ఇది రెండో పెట్టుబడి కానుంది. స్థానికంగా తయారయిన ఆహారోత్పత్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయించే అనుబంధ సంస్థను 500 మిలియన్‌ డాలర్లతో ఏర్పాటు చేసేందుకు గతంలో అనుమతులు వచ్చినప్పటికీ.. విధానాల్లో అస్పష్టత కారణంగా అమెజాన్‌ రంగంలోకి దిగలేదు. అయితే, ఆహార, నిత్యావసరాల విభాగంలో ప్రవేశించేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న అమెజాన్‌కి.. మోర్‌లో ఇన్వెస్ట్‌ చేయడం లాభించనుంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top