జుకర్‌బర్గ్‌కు అలీబాబా జాక్‌ మా ఛాలెంజ్‌

Alibaba Jack Ma Challenges Mark Zuckerberg To Fix Facebook - Sakshi

బీజింగ్‌ : ఫేస్‌బుక్‌ డేటా చోరిపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా, ఫేస్‌బుక్‌ సీఈఓ, వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు ఓ గట్టి సవాల్ విసిరారు. ఈ వివాదంపై స్పందించిన ఆయన, జుకర్‌బర్గ్‌కు చేతనైతే ఫేస్‌బుక్‌లో ఉన్న సమస్యను పరిష్కరించాలని సవాల్‌ చేశారు. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. చైనాలో అత్యంత ధనికవంతుడు అయిన జాక్‌ మా, అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌కు చైర్మన్‌. బావో ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 

అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఫేస్‌బుక్‌ తన యూజర్ల డేటాను ఎటువంటి అనుమతి లేకుండానే కేంబ్రిడ్జ్‌ అనలిటికాతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ స్కాండల్‌ ఒక్కసారిగా బయటికి పొక్కడంతో, ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కాండల్‌పై దిగ్గజ సీఈవోలందరూ స్పందిస్తున్నారు. ఫేస్‌బుక్ తన డేటా దొంగతనం కాకుండా చూసుకునే వీలు లేదని అభిప్రాయపడ్డ జాక్‌మా, సోషల్ మీడియాలోని వివరాలు బయటకు పొక్కకుండా సమస్యను పరిష్కరించి చూపించగలరా? అని జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించారు. ఫేస్‌బుక్‌ సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న విమర్శలను తొలగించే దిశగా తాము ఎటువంటి సహాయం చేయమని చెప్పారు. 

మార్చిలో కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాండల్‌ బయటపడినప్పటి నుంచి ఫేస్‌బుక్‌ షేర్లు భారీగా కిందకి పడిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే #deletefacebook అనే క్యాంపెయిన్‌ కూడా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెగ్యులేటర్లు కూడా ఫేస్‌బుక్‌ డేటా చోరిపై విచారణ జరుపుతున్నారు. ‘సమస్యను పరిష్కరించే సమయం వచ్చింది. ఈ విషయాన్ని సీఈవో సీరియస్‌గా తీసుకోవాలి. దీంతో సమస్యలను పరిష్కరించవచ్చని భావిస్తున్నా’ అని జాక్‌మా అన్నారు. మరోవైపు ఈ విషయంపై అమెరికన్‌ కాంగ్రెస్‌కు సమాధానం చెప్పేందుకు మార్క్‌ జుకర్‌బర్గ్‌ సిద్ధమవుతున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top