ఇలా చనిపోతే బీమా హుళక్కే!

8 major death cases which are not covered in term life insurance - Sakshi

అన్నిటికీ కాదు.. కొన్నిటికే పరిహారం

టర్మ్‌ పాలసీల్లో కొన్నిటికి మినహాయింపు

అనారోగ్యకర అలవాట్లను దాచిపెడితే నష్టపోవాల్సిందే

మద్యం మోతాదు మించే వారికి తిరస్కరణలు

ప్రమాదకర రైడర్లు, విన్యాసాల వారికీ రిస్కే

ప్రత్యేక రైడర్లు ఉంటే పరిహారం కష్టమే

పాలసీ తీసుకునే ముందే అన్నీ తెలుసుకోవాలి

బీమా పాలసీ ఉన్న వారు మరణానికి గురైతే బీమా కంపెనీలు పరిహారం చెల్లించడం అన్నది సహజమే. బీమా పాలసీ తీసుకునేదే అందుకు కదా..! అయితే, ఏ కారణంతో మరణించినా జీవిత బీమా పరిహారం వస్తుందని నిశ్చింతగా ఉంటే కుదరదు. ఇక్కడ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కొన్ని రకాల మరణాలకు జీవిత బీమా పాలసీల్లో కవరేజీ ఉండదన్న విషయం ముమ్మాటికీ నిజం. టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కలిగిన వారు లేదా తీసుకోవాలనుకునే వారు ఏ మరణాలకు పరిహారం ఉండదన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవడం అవసరం. ఆ వివరాలే ఇవి...

హత్యకు గురైతే..
ఉదాహరణకు.. పాలసీదారుడు హత్య కారణంగా చనిపోయినట్టు ధ్రువీకరణ అయితే, అదే సమయంలో నామినీయే హత్యలో పాల్గొన్నట్టు విచారణలు స్పష్టం చేస్తుంటే బీమా కంపెనీలు పరిహారం చెల్లించవు. నామినీపై హత్యాభియోగాలు తొలగిస్తే లేదా నిర్దోషి అయితేనే పరిహారం చెల్లింపులు జరుగుతాయి. కేసు నామినీకి అనుకూలంగా వచ్చేంత వరకు బీమా సంస్థ పరిహార చెల్లింపులను నిరవధికంగా నిలిపివేస్తుంది’’ అని ఇండియన్‌ మనీ డాట్‌ కామ్‌ సీఈవో సీఎస్‌ సుధీర్‌ తెలిపారు.

అలాగే, పాలసీదారులు నేరపూరిత చర్యల్లో పాల్గొని చనిపోయిన సందర్భాల్లోనూ బీమా కంపెనీలు పరిహార చెల్లింపును తిరస్కరిస్తాయి. ‘‘నేర కార్యకలాపాల్లో పాలసీదారుడు పాల్గొన్నట్టు నిరూపితం అయితే నామినీలకు పరిహార చెల్లింపు జరగదు. ఎటువంటి నేర కార్యక్రమంలో పాల్గొని చనిపోయినా కానీ, చట్ట ప్రకారం అది కవరేజీ పరిధిలోకి రాదు. ఒకవేళ పాలసీదారుకు నేరపూరిత చరిత్ర ఉండుండి, సహజ కారణాల వల్ల.. ఉదాహరణకు స్వైన్‌ ఫ్లూ లేదా డెంగీ లేదా పిడుగుపాటు కారణంగా చనిపోతే పరిహారాన్ని నామినీ క్లెయిమ్‌ చేసుకోవచ్చు’’ అని  పాలసీబజార్‌కు చెందిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ సంతోష్‌ అగర్వాల్‌ తెలిపారు.

ముందస్తు వ్యాధుల వల్ల..
టర్మ్‌ పాలసీ తీసుకునే నాటికి ఉన్న అనారోగ్య సమస్యలను దరఖాస్తు పత్రంలో తప్పకుండా వెల్లడించాలి. లేదంటే ఆ సమస్యల కారణంగా ఆ తర్వాత కాలంలో పాలసీదారుడు మరణించినట్టయితే.. బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. రెగ్యులర్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో కవరేజీ కాని మరణ కేసులు ఎన్నో ఉన్నాయని సుధీర్‌ వెల్లడించారు. ‘‘స్వయంగా చేసుకున్న గాయాల కారణంగా, లేదా ప్రమాదకర విన్యాసాల కారణంగా, లైంగింకంగా సంక్రమించే హెచ్‌ఐవీ లేదా ఎయిడ్స్‌ వంటి వ్యాధుల కారణంగా లేదా మందుల అధిక మోతాదు కారణంగా చనిపోతే.. వారికి ప్రత్యేక రైడర్లు ఉంటే తప్ప బీమా సంస్థలు పరిహారాన్ని నిరాకరిస్తాయి’’ అని సుధీర్‌ వివరించారు.

ఆత్మహత్య చేసుకున్నా..
బీమా పాలసీ తీసుకున్న వారు, మొదటి ఏడాది కాలంలో ఆత్మహత్య చేసుకున్నట్టయితే బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. అయితే, చాలా కంపెనీలు పాలసీదారులకు రెండో ఏడాది నుంచి ఆత్మహత్యకు కూడా పరిహారాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలోనూ నియమ, నిబంధనలు అమలు చేస్తున్నాయి.  

ప్రకృతి విపత్తుల వల్ల..
టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఉన్న వ్యక్తి భూకంపం, తీవ్ర తుపాను వంటి ప్రమాదాల్లో మరణించినట్టయితే నామినీలకు పరిహారం రాదు. ‘‘సునామీ, భూకంపం వంటి ప్రకృతి ఉత్పాతాల వల్ల తలెత్తే మరణాలు టర్మ్‌ పాలసీల్లో కవర్‌ అవ్వవు’’ అని సుధీర్‌ తెలిపారు.  
 
 ప్రసవం కారణంగా..
పాలసీ కలిగిన వారు గర్భధారణ కారణంగా లేదా ప్రసవం సమయంలో చనిపోయినట్టయితే బీమా సంస్థ నామినీకి పరిహారం చెల్లించదు. ఇటువంటి మరణాలు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల్లో కవర్‌ కావని అగర్వాల్‌ వెల్లడించారు.

ప్రమాదకరమైన కార్యకలాపాలు..
సాహసోపేత లేదా ప్రమాదకరమైన కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మరణానికి గురైతే అటువంటి సందర్భాలకు బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. ఎందుకంటే ఈ తరహా కార్యకలాపాల్లో ప్రాణ ప్రమాదం అధికంగా ఉంటుంది. ‘‘ప్రమాదకరమైన క్రీడలు.. కార్, బైక్‌ రేసింగ్, స్కైడైవింగ్, పారాగ్లైడింగ్, పారాచ్యూట్‌ తదితర వాటిల్లో పాల్గొనే వారు పాలసీ తీసుకునే సమయంలోనే వాటి గురించి వెల్లడించాలి. లేకపోతే ఈ వివరాలను వెల్లడించని కారణంగా బీమా కంపెనీలు భవిష్యత్తులో వచ్చే క్లెయిమ్‌లను అంగీకరించవు’’ అని అగర్వాల్‌ సూచించారు.

 మద్యం ప్రభావం  కారణంగా..
ఆల్కహాల్‌ లేదా మాదకద్రవ్యాలు తీసుకుని వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయిన సందర్భాల్లోనూ బీమా కంపెనీ పరిహారం చెల్లించేందుకు నిరాకరిస్తుంది. ‘‘మద్యం తరచుగా తీసుకునే వారికి, మాదకద్రవ్యాల అలవాటు ఉన్న వారికి బీమా కంపెనీలు అరుదుగానే పాలసీలను ఇస్తుంటాయి. టర్మ్‌ బీమా తీసుకునే సమయంలో ఈ అలవాట్ల గురించి వెల్లడించకపోతే, ఆ తర్వాత ఈ అలవాట్ల కారణంగా పాలసీదారులు మరణానికి గురైతే.. పరిహారాన్ని కంపెనీలు నిలిపివేస్తాయి. అధికంగా మద్యం సేవించే వారికి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ లభించడం కష్టమే’’ అని సుధీర్‌ వివరించారు. ‘‘ఒకవేళ మీరు ఆల్కహాల్‌ తీసుకునే వారు అయితే, భవిష్యత్తులో మరణ పరిహార క్లెయిమ్‌ తిరస్కరణకు గురికాకూడదని భావిస్తే.. ఆల్కహాల్‌ను ఏ మోతాదులో తీసుకుంటారనే వివరాలను ప్రపోజల్‌ పత్రంలో వెల్లడించడం తప్పనిసరి’’ అని కోటక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అక్చుయరీ సునీల్‌శర్మ సూచించారు.
 
పొగతాగే అలవాటు దాచిపెడితే..
సాధారణంగా పొగతాగే అలవాటును చాలా మంది బీమా పాలసీ దరఖాస్తు పత్రాల్లో వెల్లడించరు. వెల్లడిస్తే ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుందని అలా చేస్తుంటారు. కానీ, పొగతాగే అలవాటు ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఈ అనారోగ్య అలవాటు కారణంగా వారికి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలవాటు తీవ్రతను బట్టి కేన్సర్‌ వంటివి సోకి మరణించే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఈ విధమైన రిస్క్‌ ఉంటుంది కనుకనే బీమా కంపెనీలు పొగతాగే అలవాటు ఉన్న వారికి బీమా ప్రీమియంను అధికంగా నిర్ణయిస్తుంటాయి. పొగతాగే అలవాటును బీమా పాలసీల్లో వెల్లడించని వారు, ఆ తర్వాత అదే అలవాటు కారణంగా అనారోగ్యంతో మరణిస్తే పరిహారాన్ని తిరస్కరించేందుకు దారితీస్తుందని సుధీర్‌ తెలిపారు. పాలసీ దరఖాస్తును పూర్తిగా చదివిన తర్వాతే టర్మ్‌ పాలసీని తీసుకోవాలని.. మినహాయింపుల గురించి ముందుగానే తెలుసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చని సూచించారు.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top