పార్టీ బలోపేతానికి పాటుపడండి

YSRCP Leaders Comments On TDP Government Kurnool - Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తిస్తే వైఎస్‌ఆర్‌ పాలనను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో చూసుకోవచ్చని ఆ పార్టీ జిల్లా రీజనల్‌ కోఆర్డినేటర్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. సోమవారం కర్నూలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాం, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి(ఎమ్మిగనూరు), నియోజకవర్గ సమన్వయకర్తలు మురళీకృష్ణ(కోడుమూరు), కాటసాని రామిరెడ్డి(బనగానపల్లె), కంగాటి శ్రీదేవి(పత్తికొండ),  హఫీజ్‌ఖాన్‌(కర్నూలు), జగన్మోహన్‌రెడ్డి(ఎమ్మిగనూరు),  రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌరు వెంకటరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నియోజకవర్గ నేతలు గంగుల బిజేంద్రారెడ్డి(ఆళ్లగడ్డ), ప్రదీప్‌రెడ్డి(పత్తికొండ), శిల్పా రవిచంద్రకిశోరరెడ్డి(నంద్యాల), పీఏసీ సభ్యుడు డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేకపాటి గౌతంరెడ్డి హాజరై.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. భవిష్యత్‌లో పార్టీ అనుసరించాల్సి వ్యూహాలు, టీడీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో  ప్రణాళికలు, నియోజకవర్గాల వారీగా పార్టీ పటిష్టం కోసం తీసుకోవాల్సిన చర్యలు,  బూత్‌ కమిటీల నియామకాలు, జిల్లా, అనుబంధ కమిటీ పదవుల భర్తీపై సుదీర్ఘ చర్చ సాగింది. పార్టీ బలోపేతం కోసం ప్రజాప్రతినిధులు,ఇన్‌చార్జ్‌లు ఇచ్చే సలహాలు, సూచనలను అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని గౌతంరెడ్డి చెప్పారు. సమావేశం ప్రారంభానికి ముందు ఆలూరు మండలం హత్తిబెళగల్‌ క్వారీ పేలుడులో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గౌతంరెడ్డి మాట్లాడుతూ..పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకులకు తగు న్యాయం చేస్తామని చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి నాయకులు, కార్యకర్తలు కీలకంగా పనిచేయాలని సూచించారు.

ముఖ్యంగా బూత్‌ కమిటీలు పటిష్టంగా ఏర్పాటు చేసుకుంటే సగం విజయం వరించినట్లేనని చెప్పారు. బూత్‌ కమిటీల నియామకంలో నిర్లక్ష్యాన్ని పార్టీ అధినేత సహించరని, వారం, పది రోజుల్లో అన్ని బూత్‌ కమిటీలు, వాటికి కన్వీనర్లను ఎంపిక చేసి పార్టీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. 

అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒక్కో కార్యకర్త కనీసం 50 మందిని పార్టీ వైపు తీసుకొస్తే టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. హత్తిబెళగల్‌ క్వారీ ఘటనలో ప్రభుత్వ వైఫల్యాలే అధికంగా ఉన్నాయని,  క్వారీని వెంటనే సీజ్‌ చేసి యజమాని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top