
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్‌గా మారారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీ. రామచంద్రయ్య విమర్శించారు. సొంతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం పవన్‌కు తెలియదని, చంద్రబాబు రాయించిన స్క్రిప్ట్‌ను పవన్ చదివడం సరికాదన్నారు. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తుల వల్ల రాజకీయాలు అప్రతిష్ట పాలవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్‌ల విజన్ తమకు అవసరం లేదన్నారు. నవరత్నాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామని, వాటిని అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రామచంద్రయ్య స్పష్టం చేశారు.
ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నాయుడు దోచుకున్న అవినీతి సొమ్ము ప్రతి పైసా కక్కిస్తాం. ప్రజలకు ఏది మంచి చేయాలో అదే చేస్తాం. పవన్ మాటలో అర్థం లేదు. అమ్మఒడి పథకం మంచిదా కాదా అన్నది పవన్ స్పష్టం చేయాలి. ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి అమ్మఒడి వర్తించేలా చూడలాన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం. చంద్రబాబు అవినీతిని ప్రశ్నించే దమ్ము పవన్ కళ్యాణ్‌కు లేదు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇంకా సక్రమంగా ప్రారంభం కాలేదు. అంతలోనే విమర్శలు చేయడం సిగ్గుచేటు. పోలవరం ప్రస్తుతం వరదల్లో ఉంది. వరదనీటిలో పనులు ఎలా చేస్తారో కూడా కనీస అవగాహన లేకుండా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు అని సాక్ష్యత్తు ప్రధానినే విమర్శించారు. కులం లేదు మతం లేదు అన్న పవన్ పక్క పార్టీల్లో కులాల గురించి లెక్కలు వేస్తున్నారు. జనసేన టీడీపీకి బీ టీమ్ అయింది. పంది కొక్కుల్లా రాష్ట్రాన్ని దోచుకున్న టీడీపీ నేతలను పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు’ అని ప్రశ్నించారు.